అమెరికాలో ఉంటూ.. హైదరాబాద్‌లో దొంగను పట్టేశాడు

by Harish |
అమెరికాలో ఉంటూ.. హైదరాబాద్‌లో దొంగను పట్టేశాడు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో నివసిస్తున్న ఒక తెలంగాణ వాసి హైదరాబాద్ లోని తన సొంత ఇంటిలోకి దొంగ జొరబడిన విషయం గమనించి ఇరుగుపొరుగు వారిని, పోలీసులను అప్రమత్తం చేయడం, ఆ దొంగను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయి థ్రిల్లర్ సినిమాను తలపించింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఒక ఇంటి ఓనర్ అమెరికాలో ఉంటున్నారు. అయితే బుధవారం రాత్రి తన ఇంట్లోకి దొంగ జొరబడటాన్ని అమెరికానుంచి సీసీ టీవీలో చూసి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కి కాల్ చేయడం వారు కెబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌‌కి పురమాయించగా వారు ఆ దొంగను పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది.

డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్యాంబాబు, ఇద్దరు కానిస్టేబుల్స్ దొంగ దూరిన ఆ ఇంటికి వెళ్లి అతడిని లొంగదీసుకున్నారు. లోపలినుంచి గొళ్లెం పెట్టి బయటకు రానని దొంగ మొరాయించడంతో ఇన్ స్పెక్టర్ కిటీకీ డోర్ పగులగొట్టి బెడ్ రూమ్‌లో నక్కి ఉన్న అతగాడిని పట్టుకుని అరెస్టు చేశారు.

ఆ తర్వాత పోలీసులు శోధించగా, దొంగ దూరిన ఇంటిలోని కప్ బోర్జులు, షెల్వ్స్ ఖాళీగా ఉండటం గమనించారు. దొంగ ఒక సోఫా కింద దాచి ఉంచిన నగలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ఆ దొంగ పేరు రామకృష్ణ. తన వయస్సు 32 ఏళ్లు. సినిమా షూటింగ్ సమయాల్లో హెల్పర్‌గా పనిచేసేవాడు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇతడు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తున్నాడని, ఇప్పటికే పది సార్లు ఇళ్లలో దొంగతనం చేసి అరెస్టై జైలు కెళ్లాడని పోలీసులు చెప్పారు. తలుపులకు గొళ్ళెం పెట్టిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అతడు చోరీకి దిగేవాడని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

అంతా టెక్నాలజీ మహిమే

అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ కెపీహెచ్‌బీ కాలనీ వాసి ఇక్కడి తన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి వాటికి మోషన్ సెన్సర్లను కూడా జత చేశారు. బుధవారం రాత్రి అమెరికాలో పని చేసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి తన మొబైల్ ఫోన్ నుంచి అలెర్ట్ కాల్ వచ్చింది. ఆ ఫుటేజీని చూసిన అతను షాక్ తిన్నాడు. హైదరాబాద్ లోని తన ఇంట్లోకి దొంగ దూరటం చూసి తక్షణం పొరుగువారికి కాల్ చేశారు. మార్చి 9 బుధవారం రాత్రి 3 గంటలకు ఈ ఘటన జరగగా పొరుగు వారు ఆ ఇంటికి వచ్చి చూస్తే తాళాలు విరిగిపోయి ఉండటం, లోపలినుంచి గొళ్లెం పెట్టి ఉండటం చూసి వెంటనే పోలీసులకు కాల్ చేశారు.

అమెరికాలో ఉంటూ హైదరాబాద్ లోని స్వగృహంలోకి జొరబడిన దొంగను అక్కడి నుంచే సీసీటీవీలో చూసి పోలీసులకు కబురు పంపడం, దొంగను పట్టుకోవడం హాలీవుడ్ మూవీస్‌లోనే చూసి ఉంటాం. అది నిజజీవితంలో ఇలా జరగడమే వింతల్లో వింత. టెక్నాలజీ మానవ జీవితానికి ఎలాంటి భద్రతను అందిస్తోందో చెప్పడానికి ఇది తిరుగులేని నమూనా మరి.

Advertisement

Next Story