నాడు ప్రజా సమస్యలపై.. నేడు మృత్యువుతో పోరాటం

by Dishadaily Web Desk |
నాడు ప్రజా సమస్యలపై.. నేడు మృత్యువుతో పోరాటం
X

దిశ, తుంగతుర్తి: ఆదినుండి మొదలుకొంటే మొన్నటి వరకు ప్రజా ప్రజా సమస్యలపై నిరంతర పోరాడిన వీరవనిత మల్లు స్వరాజ్యం నేడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. నాడు నైజాం నవాబులను శక్తి, యుక్తులతో ధీటుగా ఎదుర్కొని అలుపెరుగని పోరాటంలో విజయాలను మూటగట్టుకున్న ఆమె నేడు యమధర్మరాజుతో మూడు రోజులుగా పోరాటాలు కొనసాగించడం మరో విశేషం. 92 సంవత్సరాల వయసు కలిగిన మల్లు స్వరాజ్యం ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్సపొందుతున్న విషయం తెలుసుకొన్న యావత్ జనం కన్నీరు పెడుతోంది. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ ప్రజానీకం ముక్కోటి దేవతలను వేడుకుంటోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో భీమ్ రెడ్డి రామ్ రెడ్డి, చొక్కమ్మ దంపతులకు కలిగిన సంతానమే స్వరాజ్యం. ఈమె తోడబుట్టిన అన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, అక్క శశిరేఖ ఉండగా మూడో సంతానంగా స్వరాజ్యం జన్మించారు. అనంతరం చెల్లెలు సరస్వతి, తమ్ముడు రాజకీయ కురువృద్ధుడు అయిన భీమ్ రెడ్డి కుశలవ రెడ్డిలు ఉన్నారు. ముఖ్యంగా అన్న నరసింహారెడ్డి స్ఫూర్తితో 13వ ఏటనే ఆమె ఆనాడు నైజాం సర్కారు ప్రజానీకాన్ని పెడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా పోరాట రంగంలోకి దూకారు. ఆనాటినుండి వృద్ధాప్యం మీదపడ్డప్పటికీ కూడా ప్రజా సమస్యల పరిష్కారంపై వెనుతిరిగి చూడలేదు. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె జరిపిన పోరాటం చరిత్రకే రికార్డుగా మారింది. ఆ పోరాట వివరాలు చెప్పాలంటే గంటలు కాదు కదా...! రోజుల తరబడి చెప్పినా తక్కువే. 1945లో తుంగతుర్తి నియోజకవర్గం మామిళ్లమడవ గ్రామానికి చెందిన ఉద్యమ వీరుడు కామ్రేడ్ మల్లు నరసింహారెడ్డితో వివాహం జరిగింది. అటు భర్త..ఇటు తాను పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన తీరు వర్ణనాతీతం.దిశ, తుంగతుర్తి: ఆదినుండి మొదలుకొంటే మొన్నటి వరకు ప్రజా ప్రజా సమస్యలపై

1978, 1983 సంవత్సరాలలో తుంగతుర్తి శాసనసభ నుండి సీపీఎం పార్టీ తరఫున ఎన్నికైన ఆమె 1985, 89లో పలు కారణాల వల్ల ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆమె పోరాటం పేద ప్రజల సంక్షేమంపైనే కొనసాగింది. సీపీఎం పార్టీలో అఖిల భారత ఉపాధ్యక్షురాలిగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా, ఇలా ఎన్నెన్నో కీలకమైన పదవుల్లో ఆమె కొనసాగారు. 92 సంవత్సరాల వయసు కలిగిన స్వరాజ్యం ఇప్పటికీ కూడా సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగుతోంది. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. రెండు, మూడు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. కాగా ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి అనారోగ్యంతోనే 2004, డిసెంబర్ 25న మృతి చెందారు. వీరికి ముగ్గురు సంతానం. ప్రథముడైన మల్లు గౌతమ్ రెడ్డి హోమియోపతి డాక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మిర్యాలగూడ సీపీఎం పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. రెండవ సంతానం పాదూరి కరుణ. ఈమె సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడవ వారైన మల్లు నాగార్జున రెడ్డి సీపీఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Advertisement

Next Story