మెప్మా ఆర్పీల సమస్యలను పరిష్కరించాలి

by Sridhar Babu |
మెప్మా ఆర్పీల సమస్యలను పరిష్కరించాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మెప్మా ఆర్సీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త అందోళన చేపడతామని హెచ్చరించారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి అశోక్ మాట్లాడుతూ హరితహారం, పట్టణ ప్రగతి, తడి చెత్త, పొడి చెత్త స్వచ్ఛ సర్వేక్షన్, డబుల్ బెడ్ రూమ్ సర్వే, అనాథ పిల్లల సర్వే, బతుకమ్మ చీరల పంపిణీ, బీఎల్ఓ డ్యూటీలు, మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం, స్త్రీ నిధి ఇలా అనేక రకాల పనులు ప్రభుత్వం మెప్మా ఆర్సీలతో చేయిస్తుందన్నారు.

కానీ జీతం మాత్రం నెలకు రూ. 6 వేలు మాత్రమే చెల్లిస్తుందన్నారు. కేవలం రూ.6 వేలతో కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రశ్నించారు. జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. అదే విధంగా ఆర్పీలందరికీ 10 లక్షల రూపాయల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన డ్రెస్ కోడ్ అమలు చేయాలని, వేతనాలు వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని, అర్సీలందరికీ గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. వెంటనే ఆర్సీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని అశోక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్సీ జిల్లా అధ్యక్షురాలుగా ఎన్. బాలమణి, కార్యదర్శిగా సీహెచ్. నంద, ఉపాధ్యక్షులుగా ఎం. లక్ష్మి, వి.కవిత, సహాయ కార్యదర్శులుగా వినోద, పి.జ్యోతి, కోశాధికారిగా సునీతలను ఎన్నుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed