Ola: మరోసారి ఫుడ్ డెలివరీ సేవల్లోకి ఓలా.. 10 నిమిషాల్లో డెలివరీ

by S Gopi |
Ola: మరోసారి ఫుడ్ డెలివరీ సేవల్లోకి ఓలా.. 10 నిమిషాల్లో డెలివరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఓలా క్యాబ్స్ కో-ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ప్లాట్‌ఫామ్ సహాయంతో ఫుడ్ డెలివరీ సేవల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. దేశంలో వేగంగా పెరుగుతున్న క్విక్-ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నట్టు భవీష్ అగర్వాల్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా చాలా కంపెనీలు అత్యంత వేగంగా కస్టమర్లకు కిరాణా, ఆహార పదార్థాల డెలివరీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా సైతం ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఫుడ్ డెలివరీతో పాటు ఇతర సేవలను కూడా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్టు భవీష్ అగర్వాల్ చెప్పారు. ఓలా కొత్త ఫుడ్ డెలివరీ సేవల కోసం 'ఓలా డాష్‌' పేరుతో బెంగళూరు నుంచి ప్రారంభించనుంది. ఓలా డాష్ సేవలను కంపెనీ గతంలో కూడా పలుమార్లు ఉపయోగించింది. తొలుత 2015లోనే ఫుడ్ డెలివరీ సేవల కోసం మొదలుప్పట్టినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడంతో తొమ్మిది నెలలకే మూసేసింది. ఆ తర్వాత 2021లో కిరాణా సరుకుల డెలివరీ కోసం ఓలా డాష్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబై, బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించినప్పటికీ ఏడాది తర్వాత దాన్ని నిలిపేసింది. ఇప్పుడు మరోసారి తిరిగి ఫుడ్ డెలివరీ సేవల కోసం పునఃప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed