Jpc: జమిలిపై జేపీసీ ఏర్పాటు.. ప్రియాంక సహా 31 ఎంపీలకు చోటు

by vinod kumar |
Jpc: జమిలిపై జేపీసీ ఏర్పాటు.. ప్రియాంక సహా 31 ఎంపీలకు చోటు
X

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)ని బుధవారం ఏర్పాటు చేసింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్‌లో 31 మంది ఎంపీలకు చోటు కల్పించగా.. లోక్ సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మందికి ప్రాతినిధ్యం దక్కింది. కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) , మనీష్ తివారీ (Manish thiwari), సుఖ్‌దేవ్‌ భగత్‌సింగ్‌లు ఎంపికయ్యారు. ఇక, బీజేపీ నుంచి10 మంది ఎంపీలు ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి కళ్యాణ్ బెనర్జీకి చోటు కల్పించారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి వారంలో జేపీసీ తన నివేదికను సభకు అందజేయనున్నట్టు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి.

31 మంది సభ్యులు వీరే

జేపీసీలో నియామకమైన 21 మంది లోక్ సభ సభ్యుల్లో పీపీ చౌదరి, సీఎం రమేష్, బన్సూరి స్వరాజ్, పర్షోత్తంభాయ్ రూపాలా, అనురాగ్ సింగ్ ఠాకూర్, విష్ణు దయాళ్ రామ్, భర్తృహరి మహతాబ్, సంబిత్ పాత్ర, అనిల్ బలుని, విష్ణు దత్ శర్మ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సుఖదేయో భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వగణపతి, సుప్రియా సూలే, జీఎం హర్ష బాలయోగి, శ్రీకాంత్ ఏకనాథ్ షిండే, చందన్ చౌహాన్, బాలశౌరి వల్లభనేనిలు ఉన్నారు. రాజ్యసభ నుంచి పది మంది ఎంపీలు ఉండగా వారి పేర్లను ఇంకా ప్రకటించలేదు.

ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు

జేపీసీలో ఆంద్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. వీరిలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎంపీ బాలయోగి, జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరిలు సభ్యులుగా ఉన్నారు. కాగా, జేపీసీలో తెలంగాణకు చెందిన ఒక్క ఎంపీకి కూడా ప్రాతినిధ్యం దక్కక పోవడం గమనార్హం. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎంకు చెందిన ఒక ఎంపీ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed