'రాజస్థాన్' ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మలింగ

by Harish |   ( Updated:2022-03-11 14:24:54.0  )
రాజస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మలింగ
X

న్యూఢిల్లీ : ఐపీఎల్-15 సీజన్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. దాంతో ఆయా ఫ్రాంచైజీలు కో‌చ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్‌ల నియామకాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కీలక నియామకం చేపట్టింది. జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగను నియమించింది. ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా, ఐపీఎల్‌లో మలింగ ముంబై ఇండియన్స్ తరఫున దాదాపు దశాబ్దకాలం ప్రాతినిథ్యం వహించాడు. యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అతను.. ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2019 ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి బంతికి రెండు పరుగులు ఇవ్వకుండా అడ్డుకుని ముంబైకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో గతేడాది మలింగ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో122 మ్యాచ్‌లు ఆడిన మలింగ 170 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇప్పటికీ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ముంబై జట్టుకు మెంటార్‌గా పనిచేయడంతోపాటు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన చేసిన శ్రీలంక జట్టుకు బౌలింగ్ స్ట్రాటజీ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో యార్కర్స్ స్పెషలిస్ట్ మలింగను జట్టులో చేర్చుకుని రాజస్థాన్ తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకుంది. కాగా, ఈ ఏడాది రాజస్థాన్ జట్టుకు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే, గతంలో రాజస్థాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ప్యాడీ ఆప్టన్‌ను టీమ్ అనాలసిస్ట్‌గా నియమించింది. ఆప్టన్ గతంలో టీమ్ ఇండియాకు అనాలసిస్ట్‌గా పనిచేశాడు.


Advertisement

Next Story

Most Viewed