ప్రేమికుల ఆత్మహత్య.. ప్రియుడి మృతి..

by Javid Pasha |
ప్రేమికుల ఆత్మహత్య.. ప్రియుడి మృతి..
X

దిశ, సిద్దిపేట : ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్న కోడూరు మండలంలోని సికిండ్లాపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఇందులో ప్రియుడు మృతిచెందగా ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న కోడూరు మండలంలోని చేర్ల అంకిరెడ్డి పల్లికి చెందిన నరేష్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నరేష్‌కు గత ఎనిమిది నెలల క్రితం వివాహం కాగా వివాహమైన నెలకే అతని భార్య గొడవపడి తల్లిగారింటికి వెళ్ళిపోయింది. నరేష్ గతనెల 30న అదే గ్రామానికి చెందిన ఓ యువతిని తీసుకొని ఇంటి నుండి వెళ్ళాడు.

అదే రోజు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ లో నరేష్ పై అనుమానం ఉందని యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అప్పటినుండి వారిద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం సికింద్లాపూర్ శివారులో గల పరికేన గుట్టకు నరేష్ ఉరి వేసుకుని వేలాడుతున్నాడని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి నరేష్ వేప చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దగ్గరికి వెళ్లి చూసేసరికి నరేష్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు. నరేష్ తీసుకెళ్ళిన ఆ యువతి కూడా అక్కడే అపస్మారక స్థితిలో మెడకు నల్లని కమిలిన గాయంతో ఉంది.

నరేష్ ఉరివేసుకున్న చెట్టు కొమ్మ పక్కకు ఇంకొక చున్ని సగం వరకు తెగిపోయి ఉంది. ఎస్ఐ శివానందం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story