కల్వకుంట్ల పాలన అంతమే పాదయాత్ర లక్ష్యం : బండి సంజయ్

by Nagaya |
కల్వకుంట్ల పాలన అంతమే పాదయాత్ర లక్ష్యం : బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన అంతమే రెండో విడత పాదయాత్ర లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​అన్నారు. మొదటి విడత పాదయాత్రలో భాగంగా పాతబస్తీ సభతో సత్తా చాటామని, అలాగే రెండో విడత పాదయాత్రతో చరిత్ర సృష్టించాలని ఆయన స్పష్టం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పాదయాత్ర అసెంబ్లీ సమన్వయకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ప్రజా సమస్యల గుర్తింపుతోపాటు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన అంశాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలో సభ అంటే ఎవరూ నమ్మలేదని, అక్కడ సభ పెట్టే దమ్ముందా? అని చాలా మంది నవ్వుకున్నారని, కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో కనీవినీ ఎరగని రీతిలో సభ పెట్టి సత్తా చూపించామని తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి చేపడుతున్న రెండో విడత యాత్రను అష్టాదశ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ను అవమానించారని మండిపడ్డారు. ఈ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని బండి సంజయ్​తెలిపారు. పాదయాత్ర జరిగే రోజుల్లో వీలు చూసుకుని వస్తానని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారని బండి వెల్లడించారు. ఈ యాత్రకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు సైతం హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కల్వకుంట్ల అరాచక పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో గడపగడపకూ వెళ్లి బీజేపీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ కోసం పోరాటాలు చేసి కేసీఆర్ పాలనలో వివక్షకు గురవుతున్న ఉద్యమకారులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.

పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున చేరికలుండే అవకాశం ఉందని సంజయ్​వెల్లడించారు. ఇందులో పెద్ద నాయకులతోపాటు వార్డుమెంబర్ మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు, పాదయాత్ర కమిటీ ప్రముఖ్ డాక్టర్ జీ మనోహర్ రెడ్డి, కోశాధికారి బండారి శాంతి కుమార్, సహ ప్రముఖ్ లు వీరేందర్ గౌడ్, కుమ్మరి శంకర్, కార్యదర్శి కొల్లి మాధవి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story