ఆపరేషన్ 111.. ఆ ప్రాంత భూములపై బడా నేతల నజర్..!

by Satheesh |
ఆపరేషన్ 111.. ఆ ప్రాంత భూములపై బడా నేతల నజర్..!
X

111 జీవో రద్దు అంశం తెరపైకి రావడంతో వట్టినాగులపల్లి గట్టి వార్నింగులకు కేరాఫ్​ గా మారింది. సుమారు 20 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ పెద్దలు, వారి బంధువులు రంగ ప్రవేశం చేశారు. నిషేధిత ప్రాంతం కావడంతో ఇన్నాళ్లూ నిర్మాణాలకు నోచుకోకుండా ఉన్న భూములను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక బృందాలు వాలిపోయాయి. గోపన్ పల్లి, గోల్డ్ మైన్ పక్కనే ఉన్న శంకర్ హిల్స్ పేరిట ప్లాట్లు గా మారిన భూమిని చేజిక్కించుకునేందుకు బెదిరింపులు మొదలయ్యాయి. ప్లాట్లుగా మార్చి అమ్మినా.. సదరు భూమి ఇప్పటికీ రైతుల పేరిటే ధరణి పోర్టల్ లో నమోదై ఉండటంతో రెండోసారి కొనుగోళ్లకు తెరతీశారు. వారికి ఎకరాకు రూ. కోటి చొప్పన చెల్లించి రెండో సారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. పీవోబీ లాక్ లు కూడా ఇట్టే ఓపెన్ అయిపోతున్నాయి. జీవో 111 చుట్టూ జరుగుతున్న రాబందుల భూదందా ఇదీ!

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో 111.. మరోమారు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీసిన వివాదాస్పద ఉత్తర్వు. దాన్ని ఎత్తేస్తామంటూ ఎనిమిదేండ్ల నుంచి చెబుతున్నా.. అసెంబ్లీ వేదికగా ఈ సారి సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. ఈ జీవో ఎత్తివేస్తే.. సామాన్యుల కన్నా బడాబాబులకు, రాజకీయ నాయకులు, రియల్టర్లు, బడా కంపెనీలకే మేలు కలుగుతుందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో పేదలు, సామాన్యుల దగ్గర ఆ కాస్త భూములనూ కొట్టేసేందుకు భారీ స్కెచ్ వేశారు. 40 ఏండ్ల క్రితం ప్లాట్లుగా మారిన భూములను వ్యవసాయ భూములుగా తిరిగి కొనుగోలు చేస్తున్నారు. పెద్దలు గద్దల్లా వాలుతున్నారు. షార్క్స్ మాదిరిగా రంగంలోకి దిగారు. అక్కడ బడా కంపెనీల యాజమాన్యాలకు, వ్యక్తులకు, రాజకీయ నాయకుల పేరిట ఉన్న ఆస్తుల జాబితా రూ.వేల కోట్లకు పైమాటే! అయినా భూదాహం తీరడం లేదు. జీవో 111 ఎత్తేస్తే మొదటి బాగుపడే ఏరియా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామం. సరిగ్గా అక్కడి భూములను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు భారీ స్కెచ్ వేశారు. ఓ మంత్రి పేరు చెప్పి వాటిని చేజిక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వారంతా అధికార పక్షానికి అత్యంత సన్నిహితులని ప్రచారంలో ఉన్నది. ఎకరం రూ.50 కోట్లు పలికే భూములను, రూ.కోటి, రెండు కోట్లకే రాయించుకుంటున్నారు. రూ.20 వేల కోట్ల విలువైన అతి పెద్ద భూదందాకు తెర తీశారు. జీవో 111 ఎత్తేస్తారన్న సమాచారాన్ని అందుకున్న దళారీ ముఠా హైటెక్ సిటీకి, కోకాపేట గోల్డ్​ మైన్ కు అత్యంత సమీపంలో, ఔటర్ రింగ్​రోడ్డుకు లోపలే ఖాళీగా ఉన్న సుమారు 450 ఎకరాలను బినామీ పేర్ల మీద రాయించుకునేందుకు రేయింబవళ్లూ కష్టపడుతున్నారు. ఆపరేషన్ జీవో 111గా వారి వ్యవహరం నడుస్తున్నది. వీళ్ల కొనుగోళ్లు పూర్తి కాగానే ఉత్తర్వులు వెలువడుతాయన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

ప్లాట్లనే వ్యవసాయ భూములుగా..

గండిపేట మండలం వట్టినాగులపల్లిలో సర్వే నం.111, 134, 135, 136, 137, 138, 139, 146/1, 148, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 161, 162,165,166, 171, 178, 180, 181, 183, 189, 190, 191 లలోని 461 ఎకరాల్లో శంకర్​హిల్స్ కాలనీ ఏర్పడింది. ఇందులో ప్లాట్ల విస్తీర్ణమే 16,69,358 గజాలు(344 ఎకరాలు), రోడ్లు 5,64,900 గజాలు(116 ఎకరాలు)గా ఉంది. కమ్యూనిటీ స్పేస్ కోసం 3,28,803 గజాలు(67 ఎకరాలు.. మొత్తం 593 ప్లాట్లు). వెంచర్ లో మొత్తం ప్లాట్ల సంఖ్య 3,328. ఇదిప్పుడు హార్ట్​ఆఫ్ ద సిటీగా మారింది. దీని పక్కనున్న గోపన్ పల్లి రెవెన్యూ పరిధిలో గజం రూ.లక్ష వరకు పలుకుతున్నది. కానీ ఇది మాత్రం జీవో 111 పరిధిలో ఉండడంతో నిర్మాణాలకు నోచుకోలేదు. ఖాళీగా ఉండిపోయింది. కొంత కాలంగా ఈ జీవో ఎత్తేస్తారన్న నమ్మకం బలపడింది. దాంతో ఇప్పటికిప్పుడు విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మించినా కొనుగోలుదార్లకు కొదవుండదు. అందుకే ఈ భూములను కొల్లగొట్టేందుకు అత్యంత భారీ స్కెచ్ వేశారు. ధరణి పోర్టల్​పుణ్యాన (ప్లాట్ల యజమానులకు పాపాన) ఆ భూములను అమ్మేసిన రైతుల పేరిటే హక్కులు కొనసాగుతున్నాయి. దాంతో ఆ రైతుల నుంచి రెండో సారి కొనుగోళ్లకు తెర తీశారు. ఎకరం రూ.కోటి నుంచి రూ.2 కోట్లు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి నుంచే 100 ఎకరాలకు పైగా ఈ పెద్దల ముఠా వారి బినామీల పేరిట కొనుగోలు చేసింది. అప్పట్లో గజం ధర రూ.వందల్లోనే ఉంది. కానీ మధ్య తరగతి వర్గాలు ఎన్నటికైనా ఉపయోగపడుతుందంటూ కొనుగోలు చేశారు. ఇప్పుడేమో ఎవరి ప్లాట్లు ఎక్కడున్నాయో అంతుచిక్కని పరిస్థితుల నడుమ సర్వం కోల్పోయే ప్రమాదం ముంచుకొచ్చింది.

దందా సాగుతుందిలా..

నాలుగు దశాబ్దాలుగా ప్లాట్లుగా మారిన భూములను ధరణి పుణ్యామా అని రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే కొనసాగుతున్నాయి. వేలాది సేల్​డీడ్లుగా మారిన ప్లాట్లకు బదులుగా పూర్వపు హక్కుదారుల పేర్లతోనే డేటాను అప్​లోడ్​చేశారు. స్థానిక రెవెన్యూ అధికారుల ఉద్దేశ పూర్వక తప్పిదాల కారణంగా ప్లాట్లకు బదులుగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. వాటికి రైతుబంధు సొమ్ము కూడా ఖాతాల్లో జమ అవుతున్నది. ధరణి పోర్టల్‌లో ఎవరి పేర్లు ఉంటే వారే హక్కుదారులుగా మారిన కొత్త ఆర్ఓఆర్ చట్టం (తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారుల పాసుపుస్తకం 2020) అక్రమార్కులకు వరంగా మారింది.

ఆ హక్కుదారులే రెండో సారి అధికార పార్టీ, ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు, శక్తులకు అమ్మేస్తున్నారు. కాదు కాదు.. పాసు పుస్తకాలు కలిగిన వారి నుంచి సామ, దాన, దండోపాయాల ద్వారా.. మరోసారి రూ.కోట్లు కూడబెట్టే సరికొత్త ప్లాన్​ను ఎరగా వేసి కొనేస్తున్నారు. ఇప్పటికే గడిచిన మూడు నెలలుగా 150 ఎకరాలకు పైగా ప్లాట్లుగా మారిన స్థలాన్ని వ్యవసాయ భూమిగా కొనుగోలు చేశారని తెలిసింది. రెండోసారి విక్రయించిన వారు ఎన్నటికైనా శిక్షార్హులేనన్న వాస్తవాన్ని చట్టంలోని లోపాల ఆసరాగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారికి అర్ధం కావడం లేదు. ఎప్పటికైనా ముందు సేల్​డీడ్స్ చెల్లుబాటు అవుతాయన్న నిజాన్ని గుర్తించడం లేదు.

ధరణి పోర్టల్​లో ఆ సర్వే నంబర్లపై నిషేధం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. కానీ క్రయ విక్రయాలు మాత్రం రాత్రికి రాత్రి జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్లు చేయడం, యథావిధిగా ప్రొహిబిటెడ్​లిస్టులో పెడుతున్నారు. గండిపేట మండలం వట్టినాగులపల్లి రెవెన్యూ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన క్రయ విక్రయాల జాబితాను తీస్తే ఏయే భూములను పీఓబీలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేశారో లెక్క తేలుతుంది. ఇప్పటికీ కోర్టు కేసు పేరిట వందలాది ఎకరాలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. కానీ పెద్ద బ్యాచ్ కొనుగోలు చేయాలనుకున్నా లేదా కొట్టేయాలని భావించిన భూములపై మాత్రం లావాదేవీలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

ప్లాట్ల యజమానులకు కుచ్చుటోపీ..

40 ఏండ్ల క్రితమే అదే భూమిలో వెంచర్లు వేస్తే కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులు 3 వేలకు పైగానే ఉన్నారు. ఇప్పుడు వారంతా బాధితులుగానే మిగిలిపోతున్నారు. వారి ప్లాట్లు ఎక్కడున్నాయో అంతుచిక్కడం లేదు. చేతిలో సేల్​డీడ్స్ ఉన్నప్పటికీ ఫిజికల్​పొజిషన్ తెలియక అయోమయానికి గురవుతున్నారు. శంకర్ హిల్స్ సొసైటీగా ఏర్పడి పోరాటం చేస్తున్నా.. వారికి న్యాయం జరగడం లేదు. కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ అధికార అండదండలు కలిగిన బ్యాచ్ వారిని బెదిరింపులకు గురి చేస్తున్నది. దీంతో లొంగపోక తప్పని పరిస్థితి నెలకొంది.

చక్రం తిప్పుతున్న జిల్లా అధికారి..

రూ.వేల కోట్ల విలువైన భూదందాకు రంగారెడ్డి జిల్లాకు చెందిన ముఖ్యమైన అధికారొకరు చక్రం తిప్పుతున్నారు. పెద్దల ఆశీస్సులు, ఆదేశాలతో గండిపేట ప్రాంతంలోనే ఓ విల్లాను ఏర్పాటు చేసుకొని సెటిల్మెంట్లకు దిగినట్లు సమాచారం. మరోవైపు రైతులను మాత్రం జూబ్లీహిల్స్ ప్రాంతంలోని రెస్టారెంట్లు, బార్లకు ఆహ్వానించి అన్ని రకాల మర్యాదలు చేయించి సంతకాలు చేయించుకుంటున్నారని సమాచారం. శంకర్ హిల్స్ కాలనీ ఏర్పడిన సర్వే నంబర్లలోని భూములపైనే గతేడాది నవంబరు నుంచి పెద్ద సంఖ్యలో సేల్​డీడ్స్ అయినట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చట్టాలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేపట్టిన అధికార వర్గానికి కూడా ఎలాంటి హాని జరగదని తెలుస్తూనే ఉన్నది. అయితే జీఓ 111 ఎత్తివేతతో ఈ ప్రాంతంలో గజం స్థలం రూ.లక్షకు పైగా పలకడం ఖాయం. ఈ క్రమంలో పెద్దల ముఠా వట్టినాగులపల్లిని ఏలేందుకు మూడు నెలలుగా యథేచ్ఛగా దందాను కొనసాగిస్తున్నది.

Advertisement

Next Story