HIV Positive Cafe: ఎయిడ్స్ బాధితుల 'పాజిటివ్ కేఫ్'

by samatah |   ( Updated:2022-05-04 07:38:48.0  )
HIV Positive Cafe: ఎయిడ్స్ బాధితుల పాజిటివ్ కేఫ్
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఎయిడ్స్ వ్యాధిని ప్రాణాంతకంగా పరిగణించేవారు. ఆ జబ్బు సోకినవారికి దూరంగా ఉండేవాళ్లు. కానీ హెచ్‌ఐవీ నిరోధానికి మందులు రావడంతో పాటు వ్యాధిపై అవగాహన పెరగడంతో ప్రస్తుతం ప్రజల్లోనూ మార్పొచ్చింది. ఈ క్రమంలోనే కోల్‌కతాకు చెందిన ఏడుగురు హెచ్‌ఐవీ-పాజిటివ్ యువకులు బాలిగంజ్ ప్రాంతంలో ఓ కేఫ్‌ నడుపుతూ ఎయిడ్స్‌ వ్యాధిపై ఇప్పటికీ జనాల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు కృషి చేస్తున్నారు.

2018లో డాక్టర్ కల్లోల్ ఘోష్ ఆధ్వర్యంలో జోధ్‌పూర్ పార్క్‌లోని 100 చ.అ.ల గ్యారేజీలో 'కేఫ్ పాజిటివ్' ప్రారంభమైంది. కస్టమర్ల రద్దీ పెరగడంతో ఇటీవలే ఆ కేఫ్‌ను బాలిగంజ్‌కు మార్చడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక ఆసియాలో హెచ్‌ఐవీ బాధితులు నడుపుతున్న మొట్టమొదటి కేఫ్ ఇదే కాగా.. HIV-పాజిటివ్ పిల్లల కోసం ఒక ఎన్‌జీవోను కూడా ఘోష్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే సిటీలోని నాలుగు షాపింగ్‌ మాల్స్‌లో పాజిటివ్‌ కేఫ్‌ అవుట్‌లెట్లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపాడు. ఇక తమను ఆదరిస్తున్న కోల్‌కతా వాసులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పిన ఆ యువకులు.. తాము సాధారణ మనుషుల మాదిరే చూడాలని అభిప్రాయపడ్డారు.

హెచ్‌ఐవీ బాధితులతో కేఫ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాకు స్థలం దొరకడం కష్టమైంది. చివరకు జోధ్‌పూర్‌లోని ఒక వ్యక్తి తన బిల్డింగ్ అద్దెకిచ్చేందుకు అంగీకరించినప్పటికీ చుట్టుపక్కల వాళ్లు కేఫ్‌ ఏర్పాటును వ్యతిరేకించారు. కేఫ్ నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలు పరిసర ప్రాంతాల్లో ఎయిడ్స్‌ను వ్యాప్తి చేస్తాయని ఆందోళన చెందారు. అయితే వారందరితోనూ మాట్లాడి ఒప్పించిన తర్వాతే ఈ కేఫ్ పెట్టాం. ప్రస్తుతం మా కేఫ్ వల్ల పాజిటివ్ వ్యక్తులు తలెత్తుకుని తిరుగుతున్నారు. ఇక లాక్‌డౌన్ టైమ్‌లో కేఫ్ మూతబడటంతో అందులో పనిచేసే ఏడుగురిని మా ఎన్‌జీవోనే చూసుకుంది.

- కల్లోల్ ఘోష్

Advertisement

Next Story