కేంద్రం దెబ్బకు డిఫెన్స్‌లో కేసీఆర్ సర్కార్?

by Sathputhe Rajesh |
కేంద్రం దెబ్బకు డిఫెన్స్‌లో కేసీఆర్ సర్కార్?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాల నేపథ్యలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ ఆరోపణల తీవ్రత పెంచుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఎన్నికల్లోనూ కారు పార్టీ ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని బీజేపీపై ఎటాక్ చేస్తోంది. కేంద్రం సహకరించకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అభివృద్ధి పనులు చేస్తోందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నాళ్లూ చేస్తున్న ప్రచారం తప్పు అని తేలనుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అదును చూసి దెబ్బకొట్టిన బీజేపీ?

రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని బీజేపీ చాలా కాలంగా వాదిస్తోంది. రైతు వేదికల నిర్మాణంలో కేంద్రం వాటా ఉందని, వీటిపై కేవలం ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు మాత్రమే ముద్రించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కొన్ని చోట్ల ప్రధాని మోడీ ఫోటోను బీజేపీ నేతలు ఏర్పాటు చేయగా... వాటిని టీఆర్ఎస్ నేతలు తొలగించడంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల రగడ ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ మాత్రం ఒక్క చిల్లి గవ్వ కూడా కేంద్రం ఇవ్వడం లేదని విమర్శిస్తోంది. దీంతో నిధుల విషయంలో టీఆర్ఎస్ కు బీజేపీ మధ్య లడాయి ఓ వైపు కొనసాగుతుండగానే.. మరోవైపు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల విషయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఉన్నతస్థాయిలో అనుమతులు పొందకుండా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఉపాధి హామీ పథకం పనులు విభజించారని కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఉపాధి హామీ పనులతో నిబంధనలకు విరుద్దంగా రైతు వేదికలు, కల్లాలు ఎలా నిర్మించారని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు అవకతవకలపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు 15 జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటనకు రానున్నాయి.

డిఫెన్స్ లో టీఆర్ఎస్?

ఇన్నాళ్లూ రైతు వేదికలు, కల్లాలు, పూడికతీత పనుల్లో కేంద్రం వాటా లేదని వాదించిన టీఆర్ఎస్ నేతలు కేంద్ర బృందాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కొత్త వాదన తెరపైకి తెస్తోంది. మన ఉపాధిపై కేంద్రం కత్తి పెడుతోందని, రైతులకు లబ్ది చేకూరేలా రైతు వేదికలు నిర్మించడం తప్పా? పంటను ఆరెబెట్టుకోవడానికి కల్లాలు నిర్మించడం నేరమా? అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగా ఓ సెంటి మెంట్ ను కూడా తెరపైకి తీసుకువస్తోంది. నిజానికి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఆ ప్రక్రియ ఇంకా ముందుకు సాగనే లేదు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం కొండ ప్రాంతాల్లో తవ్వాల్సిన కందకాలను మైదాన ప్రాంతాల్లో చేపట్టింది. దీంతో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన పనులని బీజేపీ వాదిస్తోంది. అయితే ఇన్నాళ్లూ రాష్ట్ర నిధులతోనే రైతు వేదికలు, కల్లాలు చేపట్టామని ప్రచారం చేస్తూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రైతులకు లాభం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను, కల్లాలను ఉపాధి హామీ పనుల్లో భాగంగా నిర్మించడాన్ని తప్పు పడుతోందని వాదించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ ఉపాధి హామీ పనుల్లో భాగంగానే వీటిని నిర్మిస్తే రైతు వేదికలపై సీఎం కేసీఆర్ తో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫోటో ఎందుకు పెట్టలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా నిధుల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ ను బీజేపీ అదును చూసి దెబ్బేసిందనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed