జూన్‌లో ఎగరనున్న 'ఆకాశ ఎయిర్' విమానాలు!

by Harish |
జూన్‌లో ఎగరనున్న ఆకాశ ఎయిర్ విమానాలు!
X

హైదరాబాద్: దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించనున్న ఎయిర్‌లైన్ సంస్థ 'ఆకాశ ఎయిర్' తన మొదటి కమర్షియల్ విమానాన్ని ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించే అవకాశాలున్నాయని సంస్థ సీఈఓ వినయ్ దూబె శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు. కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన సంబంధిత లైసెన్సులను పొందడానికి ప్రక్రియ కొనసాగుతోందని హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్‌షో కార్యక్రమంలో ఆయన అన్నారు. భారత స్టాక్ మార్కెట్ల బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మద్దతిస్తున్న ఈ సంస్థ దేశీయంగా విమాన ప్రయాణ డిమాండ్‌ను పెంచేందుకు ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలకు చెందిన మజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి దీన్ని ప్రారంభించారు. వినియోగదారులకు సరసమైన ధరల్లో విమాన ప్రయాణ సేవలను అందించడమే ఆకాశ ఎయిర్ లక్ష్యమని సంస్థ గతంలో స్పష్టం చేసింది. ఈ ఎయిర్‌లైన్ సంస్థ ప్రారంభించిన 12 నెలల్లో 18 విమానాలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఐదేళ్ల నాటికి 72 విమానాలను కలిగి ఉండనుంది. ఆకాశ ఎయిర్ సేవలు దేశీయ ప్రయాణాలకు పరిమితమని వినయ్ దూబె పేర్కొన్నారు. అయితే, ఏ ఏ నగరాల్లో సేవలందించనున్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed