- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ను వెంటాడుతున్న భయం..?
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో ప్రజల మద్దతు తమకే ఉందని చెబుతున్న టీఆర్ఎస్.. ఈ విషయంలో ప్రతిపక్షాలను తూర్పారబడుతోంది. తాము అందిస్తున్న జనరంజక పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలే తమ పార్టీకి, ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా చట్టం చేసిన ప్రభుత్వమే దాన్ని అమలు చేయడానికి సాకులు చూపడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో అనేక చోట్ల ప్రజాప్రతినిధులు లేకుండానే స్థానిక సంస్థలు పాలన కొనసాగించాల్సిన దుస్థితి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ రాజ్ సంస్థలు, పురపాలక సంఘాల్లో సుమారు 6 వేలకు పైగా పదవులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నా ఆ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ చర్యలు తీసుకోవడం లేదనే వాదన రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.
చట్టం చేసిన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం పంచాయతీ లేదా మండల పరిషత్, జడ్పీటీసీ, స్థానాలకు, పురపాలక వార్డులకు ఆకస్మికంగా ఏర్పడే ఖాళీల వివరాలను 15 రోజుల్లో పంచాయతీ కార్యదర్శి లేదా పురపాలిక అధికారి ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలి. ఆ తేది నుంచి నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ముఖ్యంగా ఈ చట్టం ప్రకారం ఎన్నికలను నిర్వహించే తేదీల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సంప్రదించాల్సి ఉంటుంది. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, పోలీసు భద్రతా, సిబ్బంది లభ్యత, ప్రకృతి వైపరిత్యాలు, విపత్తులు ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఎన్నికల తేదీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహాణకు అనుకూలమైన వాతావరణం ఉందని ఎన్నికల సంఘం భావిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికలు లేకపోవడంతో స్థానిక సంస్థల పాలనా వ్యవస్థ కుంటు పడుతోందనేది రాజకీయ పక్షాల వాదన.
వ్యతిరేకత భయంతోనే వెనుకడుగు?
2018, 2019లో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత సభ్యుల ఆకస్మిక మరణాలు, రాజీనామాలు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా అనేక చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఓ అంచనా ప్రకారం ఖాళీగా ఉన్న పదవుల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి.. సర్పంచ్ లు 217, ఉప సర్పంచ్ లు 343, జడ్పీటీసీ స్థానం 1, ఎంపీటీసీ స్థానాలు 92, పురపాలక వార్డులు 17, మండల పరిషత్ లు (ఎంపీపీ) 6, గ్రామ పంచాయతీ వార్డులు 5344 ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఖాళీ ఏర్పడిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అలా జరగడం లేదు.
ఎన్నికల నిర్వహణ విషయాన్ని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందన రావడం లేదనే టాక్ వినిపిస్తంది. కరోనా పరిస్థితుల కారణంగా కొంత వరకు ఎన్నికల విషయంలో ఆలోచనలో పడ్డ ప్రభుత్వం ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాకైనా ముందుకు రాకపోవడం పట్ల ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అందువల్లే ఎన్నికలకు సంసిద్దత వ్యక్తం చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో అనేక చోట్ల వ్యతిరేకత ఉంది. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో అప్పుల పాలై కూలీ పనులకు వెళ్తున్నామని కొంత మంది సర్పంచులు ఆవేదన వ్యక్తం చేసిన ఉదంతాలు ఉన్నాయి.
దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఫలితాలతో కారు పార్టీ జోరు తగ్గిందని మొత్తంగా ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లో కనిపించే అవకాశాలు ఉండటంతోనే కేసీఆర్ సర్కార్ ఎన్నికల నిర్వహణకు ముందుకు రావడం లేదనే టాక్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఇకనైనా ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించి స్థానిక సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.