యూనికార్న్ స్టార్టప్‌లను కలిగిన మొదటి భారతీయ జంట!

by Harish |
యూనికార్న్ స్టార్టప్‌లను కలిగిన మొదటి భారతీయ జంట!
X

న్యూఢిల్లీ: రుచి కల్రా, ఆశిష్ మొహపాత్ర అనే భారతీయ జంట తమ స్టార్టప్‌లకు 1 బిలియన్ డాలర్ల(రూ. 7,500 కోట్ల)తో యూనికార్న్ హోదాను సాధించిన మొదటి భార్యాభర్తలుగా నిలిచారు. బుధవారం పలువురు పెట్టుబడిదారుల నుంచి 200 మిలియన్ డాలర్ల(రూ. 1,500 కోట్లకు పైగా) నిధుల సమీకరణతో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్టప్ కంపెనీ ఆక్సిజో యూనికార్న్ హోదాను దక్కించుకుంది. ఆల్ఫావేవ్ గ్లోబల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్, ఇంకా ఇతరుల నుంచి ఈ నిధులు సమీకరించినట్టు కంపెనీ సహ-వ్యవస్థాపకురాలు రుచి కల్రా చెప్పారు.

గతేడాదిలోనే సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఆమె భర్త ఆశిష్ మొహపాత్రకు చెందిన ఆఫ్‌బిజినెస్ పెట్టుబడులను సాధించి యూనికార్న్ హోదాను అధిగమించింది. వీరిద్దరూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్వ విద్యార్థులు. మెకిన్సే అండ్ కంపెనీలో కలిసి పనిచేసిన సమయంలో పరిచయమయ్యారు. రుచి కల్రా ఆక్సిజో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగా, మొహపాత్ర ఆఫ్‌బిజినెస్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. 2016లో మరో ముగ్గురితో కలిసి ఈ జంట మొదటి స్టార్టప్‌గా ఆఫ్‌బిజినెస్ కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత 2017లో మరో ముగ్గురితో కలిసి ఈ జంట ఆక్సిజోను స్థాపించారు. వీరిద్దరూ ప్రారంభించిన ఈ రెండు స్టార్టప్ కంపెనీలు లాభదాయకంగానే కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed