సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో మూడు స్థానాలు పడిపోయిన భారత్!

by Disha Desk |
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో మూడు స్థానాలు పడిపోయిన భారత్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు 2030 ఎజెండాలో భాగంగా ఆమోదించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో భారత్ గత ఏడాది మూడు స్థానాలు దిగజారినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2021లో భారత్ 117 నుంచి 120వ ర్యాంక్‌కు పడిపోయింది. నివేదిక ప్రకారం.. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ మినహా అన్ని దక్షిణాసియా దేశాల కంటే వెనుకబడి ఉంది. పాకిస్తాన్ 129 వ స్థానంలో ఉంది. మిగిలిన దక్షిణాసియా దేశాల్లో భారత్ కంటే మెరుగ్గా భూటాన్ 75వ స్థానం, శ్రీలంక 87, నేపాల్ 96, బంగ్లాదేశ్ 109వ స్థానాల్లో ఉన్నాయి. భారత్ మొత్తం సుస్థిర అభివృద్ధి లక్ష్యం(ఎస్‌డీజీ) స్కోర్ 100కి 66గా ఉంది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం విడుదల చేసిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ రిపోర్ట్-2022 ప్రకారం.. ఆరోగ్య సంరక్షణ, ఆకలి నిర్మూలన, లింగ సమానత్వం, సుస్థిరతతో సహా 11 ఎస్‌డీజీలలో ప్రధాన సవాళ్ల కారణంగా భారత ర్యాంక్ పడిపోయింది. మరీ ముఖ్యంగా భారత్ నాణ్యమైన విద్య, జీవన విధానంలో అత్యంత పేలవంగా ఉందని నివేదిక అభిప్రాయపడింది. గత ఏడాది భారత్ ఆకలి నిర్మూలన, ఆహార భద్రత, లింగ సమానత్వం, మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణకు ప్రోత్సాహకాలు, కొత్త ఆవిష్కరణలు వంటి అంశాల్లో వెనకబడింది. రాష్ట్రాల వారీగా ఎస్‌డీజీ సూచీల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.

Advertisement

Next Story