ప్రజలకు కుచ్చుటోపి.. రాత్రికి రాత్రే వ్యాపారులు జంప్..!

by Satheesh |
ప్రజలకు కుచ్చుటోపి.. రాత్రికి రాత్రే వ్యాపారులు జంప్..!
X

దిశ, మోత్కూరు: ప్రజల వద్ద అప్పులు చేసి రాత్రికి రాత్రే వ్యాపారులు పారిపోయిన ఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మున్సిపల్ కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న ఓ దుకాణంలో ఇద్దరు అన్నదమ్ములు టెక్స్ టైల్స్, చెప్పులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వ్యాపారం నిర్వహిస్తూ రాత్రికి రాత్రే మూటాముల్లె సర్దుకుని ఉడాయించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, గత నాలుగేళ్ల కిందట ఒకసారి ఇదే షాపు తగలబడి పోవడంతో అప్పట్లోనే ఆ వ్యాపారి అప్పులు చేసి వాటి నుండి రక్షణ పొందేందుకు సిబ్బంది చేత షాపును తగలపెట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ ఇంటి యజమానితో ఒప్పందం చేసుకుని షాపు పునర్ నిర్మించి వ్యాపారం చేస్తున్నారు.

దశాబ్దకాలంగా తమకున్న పరిచయాలను ఆసరా చేసుకుని పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు సమాచారం. దీంతో పాటు షాపు నిర్వహణ కోసం హోల్సేల్ వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో బకాయిపడినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు 9 గంటలకే తెరిచే షాపు పది గంటలు దాటిన తెరవకపోవడంతో.. అనుమానం వచ్చి షాపు వెనుకవైపు ఉన్న దారి గుండా పరిశీలించగా షాపు మొత్తం ఖాళీ చేసినట్లు స్థానికులు అంటున్నారు. అప్పులు ఇచ్చిన వారు షాపు నిర్వాహకులకు ఫోన్ చేస్తే ఫోన్లు పనిచేయడం లేదని చెబుతున్నారు. పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించినట్లు సమాచారం. వ్యాపారులు పారిపోయిన విషయం వెలుగు చూడడంతో అప్పుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story