జోరుగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని అధికారులు

by Mahesh |
జోరుగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని అధికారులు
X

దిశ, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి మోయ తుమ్మెద వాగు కేంద్రంగా జోరుగా అక్రమ ఇసుక దందా నడుస్తుంది. పలు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఇసుక రవాణా చేసే యజమానులు అదునుగా చేసుకొని ఇష్టారాజ్యంగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సామాన్యులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుండే గ్రామ శివారులోని మోయ తుమ్మెద వాగులో ఇసుక తరలింపునకు అధిక సంఖ్యలో ట్రాక్టర్లు చొరబడి ట్రాక్టర్ యజమానులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టి ఇసుక తరలిస్తూ.. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఏర్పడకుండా స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కొన్ని ట్రాక్టర్లకు మాత్రమే ఇసుక తరలింపునకు ఆదేశాలు ఇచ్చారు.

తోటపల్లి గ్రామంలో కొందరు వాహన దారులు ఈ ఆదేశాలను అదునుగా చేసుకొని ఇసుకను తరలిస్తూ.. అధిక ధరలకు అమ్ముతున్నారు. మండలం లోని ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు లేవని.. అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా తెల్లవారుజాము నుంచే ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. అందినకాడికి సామాన్యుల నుంచి దోపిడీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఏర్పడకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు మాత్రమే ఉపయోగపడేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed