పీఆర్సీ''ఫిక్స్ కావాలా''...? పైసలు చెల్లించాల్సిందే

by Nagaya |
పీఆర్సీఫిక్స్ కావాలా...? పైసలు చెల్లించాల్సిందే
X

దిశ, తెలంగాణ బ్యూరో : పీఆర్సీ ఫిక్స్​కావాలంటే పైసలు చెల్లించాల్సిందేనంటూ ఉన్నతాధికారులు అంతర్గతంగా ఆదేశాలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు స్టేట్​ఆడిట్​కమిటీ హుకుం జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీఆర్సీ ఫిక్స్​, ఎల్ఎఫ్​సంతకాలు, ఫైళ్ల పరిశీలనకు ముడుపులు ఇవ్వనిదే పని కావడం లేదని ఆయా స్కూళ్లల్లో పనిచేసే స్టాఫ్ వాపోతున్నారు. ఆడిట్​ఆఫీసర్ల కక్కుర్తికి చట్ట ప్రకారంగా వచ్చే పీఆర్​సీ అమలుకూ డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి దాదాపు రూ. 1500 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ తతంగం అంతా గోప్యంగా జరుగుతున్నది. స్వయంగా కొందరు ప్రిన్సిపాళ్ళు దగ్గరుండి మరి ఈ విధానాన్ని ప్రోత్సహించడం గమనార్హం. మనీ ఇవ్వని వాళ్లకు బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు తెలిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల మంది టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్​ఉద్యోగులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్​ విధిగా ఇచ్చే పీఆర్సీకి కూడా కమీషన్లు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పేద పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దే తమపై ఇలాంటి దోపిడీ సరికాదంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ విధానాన్ని అరికట్టేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

మీకు పెరిగితే మాకేంటి లాభం..?

పీఆర్సీ అమలు అనేది యథావిధిగా ప్రభుత్వం చేయాల్సిన పని. అయితే 30% ఫిట్​మెంట్ పెరగడం వలన ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతాయి. దీంతో ఒక్కో వ్యక్తి 1500 నుంచి 2 వేల వరకు ఇవ్వడం వలన నష్టమేమీ లేదని చెబుతూ వసూళ్ళకు పాల్పడటం దారుణం. స్టాఫ్​ అందరినీ ఆయా స్కూళ్ళ ప్రిన్సిపాళ్లు భయపెట్టి మరి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ వ్యవహరం పెద్ద మొత్తంలో జరుగుతున్నది. ఎలాంటి నిబంధనలు లేకపోయినా డబ్బులు తీసుకోవడం విచిత్రంగా ఉన్నది. స్వయంగా ఉన్నతాధికారులే ఇలా డబ్బులు చెల్లించాలని ఆదేశిస్తుండటంతో చేసేదేమీ లేక చాలా మంది ఇచ్చేస్తున్నారు. అయితే ఉద్యోగుల నుంచి కొందరు ప్రిన్సిపాళ్లు తీసుకుంటున్న డబ్బులు అడిట్​ఆఫీసర్లకు వెళ్తున్నాయా? లేదా? ప్రిన్సిపాళ్లే వాడుకుంటున్నారా? మరెవరికైనా ఇస్తున్నారా? అనేది ప్రస్తుతం ప్రశ్నర్ధంగా మారింది. ఇదే అంశంపై రెండు మూడు రోజులుగా సోషల్​ మీడియాల్లోనూ విస్తృతంగా చర్చ నడుస్తున్నది. అయినా ఇప్పటి వరకు సర్కార్​ మేల్కొనలేదు. దీంతో ప్రభుత్వంపై కూడా ఉద్యోగులకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

డబ్బులు తీసుకోవడం దారుణం: చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పీఆర్సీ అమలుకూ డబ్బులు తీసుకోవడం దారుణం. ఇది సరైన విధానం కాదు. ప్రిన్సిపాళ్లు కూడా ఈ విధానాన్ని ప్రోత్సహించడం విచిత్రంగా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మనీ వసూళ్ళకు పాల్పడితే అది లంచంగానే పరిగణించాల్సి వస్తున్నది. ఉద్యోగులను బెదిరిస్తుండటంతో ఆఫీసర్లతో లొల్లిలు ఎందుకనీ? చాలా మంది డబ్బులు ఇచ్చేస్తున్నారు. త్వరలో దీనిపై మరింత పోరాటం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.


Advertisement

Next Story