సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్

by samatah |
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్
X

న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తున్న స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) పథకాన్ని పొడిగించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉండే ఎఫ్‌డీలపై ప్రత్యేక వడ్డీని బ్యాంకు ఇస్తోంది. ఇదివరకు సీనియర్ సిటిజన్ల కోసం ఈ ఆఫర్‌ను ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఇందులో భాగంగా సాధారణంగా ఇచ్చే 0.50 శాతం వడ్డీ రేటుకు అదనంగా 0.25 శాతం వడ్డీని అందిస్తోంది. గతంలో గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ స్కీమ్ పేరిట ఉన్న పథకాన్ని ఈ ఏడాది జనవరి 20న ముగియగా, దాన్ని ఏప్రిల్ 8కి పొడిగించారు. అయితే తాజాగా ఈ ఎఫ్‌డీ స్కీమ్ గడువును మరోసారి అక్టోబర్ 7 వరకు పొడిగిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. దీంతో సీనియర్ సిటిజన్లకు ఈ పథకం మరో ఐదు నెలల పాటు అందుబాటులో ఉండనుందని, కొత్తగా ఎఫ్‌డీ ఖాతాలను తెరిచే వారికి ఈ పథకం వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా పాత ఎఫ్‌డీ ఖాతాదారులు రెన్యూవల్ చేసుకున్నా సరే కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంకు వివరించింది. అయితే, సీనియర్ సిటిజన్ల కోసం తెచ్చిన ఈ పథకం 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ప్రకారం ఐదేళ్ల 1 రోజు నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై 6.35 శాతం ఆఫర్ చేస్తోంది. ఇది సాధారణ ఎఫ్‌డీ ఖాతాదారులకు ఇస్తున్న 5.60 శాతం కంటే ఎక్కువ.

Advertisement

Next Story

Most Viewed