బాధ్యత మరిచిన ఐఏఎస్‌లు.. అక్షింతలు వేసిన పార్లమెంటరీ కమిటీ

by Vinod kumar |
బాధ్యత మరిచిన ఐఏఎస్‌లు.. అక్షింతలు వేసిన పార్లమెంటరీ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారులే యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రతీ డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ అధికారి క్రమం తప్పకుంటా ప్రతీ సంవత్సరం ఆస్తుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో డీవోపీటీకి సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర డీవోపీటీ మంత్రిత్వశాఖ 2017 నుంచి ఈ విధానాన్ని అమలుచేస్తున్నది.

అన్ని రాష్ట్రాల్లోని ఐఏఎస్ అధికారులు ప్రతీ ఏటా జనవరి 31వ తేదీలోగా అంతకు ముందు సంవత్సరానికి సంబంధించిన ప్రాపర్టీ రిటన్‌లను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలన్నది నిబంధన. అది సమర్పించని పక్షంలో శాఖాపరమైన చర్యలతో పాటు పదోన్నతులకు, డిప్యూటేషన్లకు, ఎంప్యానెల్‌మెంట్, తరువాతి స్థాయి మ్యాట్రిక్స్ పే కేటగిరీలోకి అర్హులుగా ప్రకటించడం లాంటి అంశాల్లో రిమార్కులకు గురికావాల్సి వస్తుందని డీవోపీటీ స్పష్టంగా పేర్కొన్నది.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులను అమలుచేసే అధికారులే స్వీయ క్రమశిక్షణను తప్పుతుండడంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం (రాజ్యసభ) అన్ని రాష్ట్రాల్లోని ఐఏఎస్ అధికారుల ప్రాపర్టీ రిటన్‌ల దాఖలు అంశాన్ని అధ్యయనం చేసింది. 2018 నుంచి వరుసగా మూడేళ్ళుగా వంద మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఐపీఆర్ (ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిటన్)లను సమర్పించడంలేదని గుర్తించింది.

2018లో 135 మంది, 2019లో 128 మంది, 2020లో 146 మంది, 2021లో 158 మంది సమర్పించలేదని ఉదహరించింది. వరుసగా రెండేళ్ళ నుంచి ఐపీఆర్‌లను 64 మంది దాఖలు చేయడమే లేదని పేర్కొన్నది. మూడేళ్ళుగా ఐపీఆర్‌లను సమర్పించకుండా 44 మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తుచేసింది. మూడేళ్లకంటే ముందు నుంచీ చెల్లించకుండా ఉన్నవారి సంఖ్య 32 అని నొక్కిచెప్పింది.

నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీవోపీటీకి పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. సర్వీసు రికార్డుల్లో విజిలెన్స్ క్లియరెన్సు ఇవ్వవద్దని నొక్కిచెప్పింది. డీవోపీటీ తరఫున హాజరైన ఉన్నతాధికారులు ఈ విషయాన్ని కమిటీ సభ్యులకు వివరిస్తూ, 2017 జనవరి నుంచి వార్షిక ఐపీఆర్‌లను దాఖలు చేసే నిబంధనను తీసుకొచ్చామని, పకడ్బందీగా అమలుచేయాలన్న ఉద్దేశంతో ప్రతీ ఏటా అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తుచేశారు.

కేవలం విజిలెన్స్ క్లియరెన్సును నిరాకరించడం మాత్రమే నిర్లక్ష్యంగా ఉండే అధికారులకు సరిపోదని కమిటీ తన సిఫారసుల్ల పేర్కొన్నది. ఇకపైన ఏం చర్యలు తీసుకోవాలో శాఖాపరంగా చర్చించుకుని ప్రతిపాదనలను నెల రోజుల్లో కమిటీ అందజేయాల్సిందిగా ఐదు రోజుల క్రితం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. వార్షిక ఐపీఆర్‌లను సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు ప్రస్ఫుటంగా అందరికీ తెలిసేలా వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని సూచించింది. ఆ ఆఫీసర్లపై శాఖాపరంగా తీసుకున్న చర్యలేంటో తెలియజేస్తూ నెల రోజుల్లో నివేదికను కూడా సమర్పించాలని కమిటీ ఆదేశించింది.

తెలంగాణ నుంచి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సహా ఐదుగురు 2020 సంవత్సరానికి ఐపీఆర్‌లను దాఖలు చేయలేదు. 2021 సంవత్సరానికి మొత్తం పదకొండు మంది సమర్పించలేదు.

Advertisement

Next Story