మీన రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

by Javid Pasha |   ( Updated:2024-06-02 09:36:44.0  )
మీన రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
X

పూ.భా. 4 (దీ); ఉ.భా. 1,2,3,4 (దూ,షం,ఝ,థా) రేవతి 1,2,3,4 (దే, దో, చా,చి)

ఆదాయం-2,
వ్యయం-8,

రాజపూజ్యం-1, అవమానం-7

మీన రాశి వారికి గురువు ద్వాదశంలో 13.04.2022 వరకు తామ్రమూర్తిగా ఉండును. తదుపరి జన్మమందు సువర్ణమూర్తిగాను గోచరించును. శని ఏకాదశంలో 29.04.2022 వరకు సువర్ణమూర్తిగా ఉండును. 12.07.2022 వరకు వ్యయమందు సువర్ణమూర్తిగా ఉండును. తదాది 17.01.2023 వరకు ఏకాదశంలో తామ్రమూర్తిగా ఉండును. తదాది ద్వాదశమందు రజతమూర్తిగా ఉండును. రాహువు ద్వితీయమందు కేతువు అష్టమమందు సువర్ణమూర్తులుగా ఉందురు.

ఊహలలో విహరించడం మాని జీవితానికి ఏది అవసరమో ఏది ఆచరణ యోగ్యమో, ఏది సాధ్యమో అది ఆలోచించి విజ్ఞతతో నిర్ణయించుకోవాలి. అసాధ్యమైన విషయాలపై ఆసక్తి పెంచుకోవడం అవివేకమని తెలుసుకోవాలి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. మీరు కోరుకున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇష్టమైన ప్రదేశానికి స్థానచలనం, హోదా, పరపతి ఇవి అన్నీ పెరుగుతాయి. కన్యాదాన ప్రాప్తి కలదు. ఉద్యోగం క్రమబద్దీకరింపబడే అవకాశం కలదు. నూతన వాహనప్రాప్తి, అత్యుత్సాహంతో ప్రతి పనిలోనూ మీరు పాలు పంచుకోవడం అనర్థానికి దారితీయవచ్చు. పెద్దల సంస్మరణార్థం ఒక మంచి పని చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో సఖ్యత అనుకూలత ఏర్పడుతుంది.

నూతన విద్యా ప్రవేశాలు. అతి మంచితనాన్ని తమ అసమర్థతగా లోకం భావించడాన్ని చూసి ఆవేదన పడతారు. మారడానికి ప్రయత్నం చేస్తారు. వాహనాలు నడుపునపుడు జాగ్రత్త అవసరం. అగ్ని, జల సంబంధిత ప్రమాదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు చివరలో అనుకూలంగా ఉన్నది. గట్టి ప్రయత్నం ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి. గతంలో చేసిన కొన్ని పొరపాట్లకు పశ్చాత్తాప పడతారు. జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ విషయంలో అనాలోచిత నిర్ణయం అనర్ధాలకు దారి తీయవచ్చు. ధనం చేతికందుతుంది. సంతాన సౌఖ్యం, వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తారు. మీరు గర్వంగా తలెత్తుకునే స్థాయికి మీ సంతానం అభివృద్ధి చెందుతారు.

స్త్రీ, సౌఖ్యం మానసిక నిర్మలత్వము ఏర్పడుతుంది. అభీప్సితార్ధ సిద్ధి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో చిత్త చాంచల్యం, స్త్రీ జన విరోధము, ప్రయాణాలలో వస్తు నష్టం, అకాల భోజనము వాహన ముద్రాధికారములు లభించును. పేరు ప్రతిష్టలు లభించును. భూ వసతి కలుగును. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు కేతు, జప దానాదులు చేసిన మంచిది. గత అనుభవాలు భవిష్యత్తుకు పాఠంలా ఉపయోగించుకుంటారు. ప్రయోగాత్మక వ్యాపారాలు గానీ ఇతర విషయాలు గాని అన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీరు తాగడం మేలని నిర్ణయించుకుంటారు.

ఈ రాశి ఉద్యోగస్థులకు అనుకూలంగా ఉంది. మీకు అందవలసిన ప్రయోజనాల కొరకు లేదా స్థాన చలనం కొరకు విశేష కృషి చేయండి. సంవత్సరాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం కావచ్చు. సంవత్సర ఆరంభంలో ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం కలదు. ఉద్యోగ క్రమబద్ధీకరణ కూడా జరుగును. విద్యార్థులు సంవత్సరారంభంలో చక్కని ఫలితాలు పొందుతారు. మేధస్సు, గ్రహణ శక్తి వృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే భవిష్యత్తు కొరకు చేయవలసిన ఉపాయాలు ఇప్పుడే ప్రారంభించుట మంచిది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మేల్కొపు అనేక అవకాశాలు కలవు. కుటుంబంలో మీ స్థాయి మీ విలువ పెరుగుతుంది.

తోటి వారు మీ అవసరాన్ని గుర్తిస్తారు. ఖనిజ వ్యాపారాలు చేసే వారికి అనుకూల సమయం ప్రభుత్వ పరంగా పొందవలసిన అనుమతులు పొందటానికి ఇప్పుడే బీజం వేసి ఉంచండి. దరఖాస్తు పెట్టుకోవడం, పైరవీలు చేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి మాటవింటే మేలు జరుగును. కుటుంబంలో అన్యోన్య సహకారం లభించును. సంతాన ప్రాప్తి గలదు. ప్రతిష్టాత్మకమైన వారితో పరిచయం ఏర్పడగలదు. స్వర్ణ, వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఋణ బాధ తీర్చడానికి విశేష కృషి చేస్తారు. సఫలమవుతారు. రాజకీయంగా అనుకూలంగా ఉన్నది. మే నెలలోపు ఎన్నికలలో విజయం సాధించే అవకాశం కలదు.

ప్రత్యర్థి పై పట్టు సాధించడానికి మీరు చేసే ప్రతి అడుగు మీకు అనుకూలమవుతుంది. సమాజానికి కీడు చేసే పనులు చేయడానికి మిమ్ములను ప్రోత్సహిస్తారు. జాగ్రత్త, ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉంటారు, సాధిస్తారు. స్థిరాస్తులకు విలువ పెరుగుతుంది. సమాజంలో నిజమైన సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు. స్త్రీ విభేదాలు అకారణ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ వంతు సేవ చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఒకింత గర్వాన్ని ఇస్తుంది. స్వతంత్ర వివాహాలు పెద్దల అంగీకారంతో జరుగుతాయి. ఉద్యోగంలో గతంలో ఉన్న అనేక సమస్యల నుండి బయటపడతారు. పొత్తి కడుపు లేదా ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చు.

ఔషధ సేవనం తప్పక పోవచ్చును. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. చోర భయం కలదు. జాగ్రత్త ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. విదేశాలకు వెళ్ళవలసి రావచ్చు. కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత హృదయ సంబంధిత బాధలు, వాటికి గతిన ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఫలిస్తుంది. ఎంత నియంత్రణగా ఉండాలని ప్రయత్నించినా ఒక రకమైన నిందారోపణలు ఎదుర్కొంటారు.

విదేశాల్లో స్థిర నివాస యోగ్యత ఏర్పడుతుంది. వివాహ ప్రాప్తి, మీ వాక్ చాతుర్యంచే కొందరు జీవితంలో చాలా మార్పులు తీసుకు వస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి జనాకర్షణ, ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఒకరి జీవితానికి పూర్తిగా సహకారం అందించాలని ప్రయత్నిస్తారు. సఫలమవుతారు.ప్రభుత్వ గౌరవం, రాజ లాంఛనములు అనుభవిస్తారు. తన సొమ్ము అయిననూ దాచుకొని అనుభవించవలయును. అగ్ని సంబంధమైన ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడాలి.

Advertisement

Next Story

Most Viewed