కుంభ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

by Satheesh |   ( Updated:2023-06-06 06:43:04.0  )
కుంభ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
X

ధనిష్ఠ 3, 4 (గూ, గే); శతభిషం 1, 2, 3, 4 (గో, సా, సీ, సు) పూ.భా. 1, 2, 3 (సే, సో, దా)

ఆదాయం-5

వ్యయం-2

రాజపూజ్యం-5

అవమానం-4

ఈ రాశి వారికి గురువు 13.04.2022 వరకు జన్మరాశిలో లోహమూర్తిగా ఉండును. తదుపరి ద్వితీయమందు లోహమూర్తిగాను గోచరించును. శని ద్వాదశములో 29.4.2022 వరకు లోహమూర్తిగా ఉండును. తదుపరి 12.07.2022 వరకు జన్మమందు రజతమూర్తిగా ఉండును. తదుపరి 17.01.2023 వరకు మరల ద్వాదశములో సువర్ణమూర్తిగా ఉండును. తదుపరి జన్మమందు తామ్రమూర్తిగాను ఉండును. రాహువు, కేతువులు తృతీయ, నవమ రాశుల యందు తామ్రమూర్తులుగా ఉందురు. విభేదాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. దాంపత్య విభేదాలు, వ్యాపారాలలో లాభాలు ఆశించినంత రాకున్నా ఉన్న ధనాన్ని కాపాడుకుంటే సంపాదించినట్లేనని భావించండి. ప్రయాసచే పనులు పూర్తి చేసే అవకాశం, తమ ప్రమేయం లేకున్నా ఎవరో చేసిన పొరపాటుకు తాము బాధ్యత వహించవలసిన స్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతమున్న ప్రదేశాన్ని వదిలి కొత్త ప్రదేశాల్లో నివాసం కొరకు ప్రయత్నాలు చేస్తారు.

ఏది అవసరమో అది మానివేసి అనవసర విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. సంతాన ప్రాప్తి కలదు. మౌనంతో అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. గత సంవత్సరం కన్నా కొద్దిగా మార్పు ఉన్ననూ కొద్దిపాటి నియమాలతో జీవితాన్ని సుఖమయంగా మార్చుకొనవచ్చును. వస్త్రదానం గోసేవ, వృక్షములకు నీరు పోయండి. మేలు జరుగుతుంది. సదాచారము, భగవత్ ప్రార్థన ద్వారా శని వ్యతిరేక ప్రభావము తగ్గును. తనపై తనకు ఒకరకమైన నమ్మకము లేకపోవుట. ఆత్మవిశ్వాసం తగ్గుట వలన లేని సమస్యను ఉన్నట్టుగా భ్రమించి బాధపడే అవకాశం కలదు. ఊహలు, ఆలోచనలు సరైన మార్గంలో ఉన్ననూ వాటిని అమలు పరచుటలో సఫలము కాకపోవచ్చును. స్థిరాస్థికి, చరాస్థులకు కొంత భద్రత లోపించవచ్చును. స్థిరాస్థులు అమ్మకానికి పెట్టాలని సలహాలు ఇచ్చే వారుంటారు. తస్మాత్ జాగ్రత్త. కొత్తది సంపాదించుకున్నా ఉన్నది కాపాడుకోవడము ఉత్తమము కదా! మీకు ఉన్న ఆర్థిక చికాకులు ఏ మాత్రము ఆలోచించకుండా పైకి మాత్రము కోటీశ్వరులుగా తమ ప్రవర్తన ఉండడము వలన మీ బాధలు అర్థం చేసుకునే వారే ఉండరు.

తమ సంతానం యొక్క వివాహార్థము ప్రయత్నాలు ఆరంభము చేస్తారు. ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా ఆలోచనలుగా చేసినా ఆర్థిక పరమైన వృద్ధి కనపడక పోవడం చిరాకు కల్గిస్తుంది. జీవిత భాగస్వామితో అకారణ కలహాలు ఏర్పడే అవకాశం కలదు. తమకు తెలిసిన సత్యాన్ని నిర్భయంగా వ్యక్తపరచలేని స్థితి ఏర్పడవచ్చును. నీచజన సహవాసం వలన ప్రతిష్ఠాభంగం జరుగుట, స్త్రీ పురుషులకు స్నేహం విషయంలో కొంత నియంత్రణ, బాధ్యతలు తెలుసుకొనుట ముఖ్యమైన విషయం. గతం పునరావృతమవుతుందనే భయం వెంటాడవచ్చును. వివాహ ప్రాప్తి గలదు. స్వేచ్ఛా వివాహ విషయమై కొంత వివాదము. అనిశ్చిత స్థితి మొదలగు చికాకులు ఏర్పడే అవకాశం గలదు. దాచిన సొమ్ము అంతా ఒక చెడు సలహా పాటించుటచే బూడిదలో పోసిన పన్నీరుగా మారే అవకాశం కలదు. స్వబుద్ధి ఉపయోగించండి. ధర్మాధర్మ న్యాయాన్యాయ విచక్షణ చేయండి. చెప్పుడు మాటలు తమ ఆత్మీయులను దూరం చేయవచ్చు. నూతన గృహ నిర్మాణ ఆలోచన కలిసి వచ్చును. కానీ కొద్దిగా అధిక వ్యయం చేత పూర్తి చేస్తారు. సంఘంలో గొప్పవారి పరిచయాలు ఏర్పడుతాయి.

తమ వృత్తిపరమైన పేరు ప్రతిష్ఠలు ఏర్పడుతాయి. లోకం దృష్టిలో విపరీతంగా పనుల్లో ఉన్నవారిగా ఉంటారు. కానీ దానికి తగిన ప్రతిఫలం మాత్రం లేదని ఆవేదన చెందుతారు. ఎంత కృషి చేసినా రావాల్సిన ధనము, ఆదాయం రానందున మనోవేదన తీవ్రమవుతుంది. అతి మంచితనం, మొహమాటం మొదలగు లక్షణాలచే పై పరిస్థితులు ఏర్పడుతాయి. కాలం వృథాగా గడిచినదనీ వీలైనంత శీఘ్రముగా ధనం సంపాదించుకోవాల్సిన, ఆదాయ వనరులు పెంచుకోవాలని విపరీత ప్రయత్నాలు చేస్తారు. పేరు సంపాదిస్తారు. కానీ ధనం రావడం సందేహమే. సంతానం భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. వారి భవిష్యత్తుకు కావాల్సిన పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దాంపత్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశము గలదు. చిన్న విషయము కూడా చిలికిచిలికి గాలివానలాగా మారే అవకాశం కలదు. అన్య స్నేహాల వలన తమ పరపతికి మచ్చ ఏర్పడే అవకాశం కలదు. అభిమానించే వ్యక్తులు ఆదరించడం లేదనే బాధ తీవ్రమవుతుంది. ఒకానొక సమయంలో మనసులోని విషయాలు చెప్పలేక, దాచుకోలేక సతమతమవుతారు. అందని ద్రాక్షకై తపించుట అవివేకమని తెలుసుకోవాలి.

మర్రిన్ని రాశిఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Next Story

Most Viewed