- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ ప్రధాని ఇమ్రాన్ పదవి గల్లంతేనా.. కోల్పోయిన సైన్యం మద్దతు
ఇస్లామాబాద్: నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే.. నెత్తురు చిమ్ముకుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే.. అంటూ శ్రీశ్రీ రాసిన గొప్ప కవిత ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చక్కగా సరిపోతుంది. పాక్ లెజెండరీ క్రికెటర్ స్థానం నుంచి రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన ఇమ్రాన్ ఖాన్, 2018లో పాకిస్తాన్ అధికార పీఠమెక్కగలిగారు. ఉగ్రవాదంతో, నిత్య ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోతున్న పాకిస్తాన్‌కు ఆశాదీపంలా కనిపించారు.
తనకు ముందున్న పాలకుల అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రచారం ఆయనకు ప్రజావిశ్వాసాన్ని కట్టబెట్టింది. పాకిస్తాన్ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని ఇమ్రాన్ పదే పదే చెప్పేవారు. ప్రజల నమ్మకం పునాదిగా అధికారాన్ని స్వీకరించిన ఇమ్రాన్ రాజకీయ మైదానంలో మూడేళ్ల లోపే ఎక్కడ క్లీన్ బౌల్డ్ అయ్యారు అనేది పెద్ద పజిల్. పాలనకు సంబంధించి ప్రతిదశలోనూ ఆయన వేసుకుంటూ వచ్చిన తప్పుడు అంచనాలు, మిత్రపక్షాలను నిలుపుకోలేకపోవడం కారణంగానే ఇప్పుడు ఇమ్రాన్ దాదాపు పతనం అంచున నిలబడివున్నారు.
ప్రతిపక్షాల అవిశ్వాసం తీర్మానం నెగ్గడం దాదాపు ఖాయంగా తెలుస్తున్న నేపథ్యంలో పాక్ రాజకీయ చదరంగంలో ఇమ్రాన్ పతనం కావడమే తరువాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందడమే ఇమ్రాన్ పతనానికి కారణమవుతోందని తేటతెల్లమవుతోంది. సైనిక నాయకత్వం విశ్వాసం కోల్పోవడం అనే కారణం కూడా ఉన్నప్పటికీ దేశంలో మార్పు తీసుకొస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ప్రజాపునాదికి ఇమ్రాన్ దూరమవుతున్నారని చెప్పాలి.
హామీలను జనం నమ్మారు.. మోసపోయారు..
జనరంజక క్రికెట్ స్టార్ అయిన ఇమ్రాన్ ఖాన్.. సంస్కరణలు, అవినీతి వ్యతిరేక ప్లాట్‌ఫామ్ ఆధారంగా ప్రజలను నమ్మించి 2018లో అధికారంలోకి రాగలిగారు. కానీ తన మూడేళ్లకు పైబడిన కాలంలో దేశం కొవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకోవడమే కాదు, కనీవినీ ఎరుగని ద్రవ్యోల్బణం, దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థతో దెబ్బతినిపోయింది. ఇమ్రాన్ చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోయారని, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లనుంచి దేశాన్ని గట్టెక్కించలేక పోయారని ప్రతిపక్షం నేరుగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇమ్రాన్ అసమర్థతతో తోటి పార్టీకి చెందినవారే విసిగిపోయారని తెలుస్తోంది. పార్టీనేతలు, పాలక పక్షాన్ని వెన్నంటి నిలిచిన మిత్రపక్షాలు కూడా ప్రతిపక్షంలోకి ఫిరాయించినట్లు నిర్ధారణ అయింది.
అయితే దీనికంటే ముఖ్యంగా శత్రుపూరిత రాజకీయాలకు ఇమ్రాన్ మొదటినుంచి బ్రాండ్ నేమ్‌గా మారిపోవడంతో తన పలుకుబడి క్షీణిస్తూ వచ్చింది. రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ప్రత్యేకించి దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన పంజాబ్‌లో అస్తవ్యస్త పాలనపై ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఇమ్రాన్ కనీసం ప్రయత్నం చేయలేదు. సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పాలనలో పంజాబ్ ప్రభుత్వం పలుకుబడి ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ ఇమ్రాన్ అక్కడి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించలేదు.
సైన్యంతో పెట్టుకున్నారు..
పంజాబ్ లోని అస్తవ్యస్త పరిస్థితులు ప్రతిపక్షాలకు, సైన్యానికి కూడా ఊతమిచ్చినట్లయి చివరికి ఇమ్రాన్ పదవికి ఎసరు తెస్తున్నట్లు భావిస్తున్నారు. పైగా 2020 లోనే మూడు పార్టీలు కలిసి పొత్తు కుదుర్చుకున్న పాక్ ప్రతిపక్షం పాక్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ని దింపేయడానికి సుదీర్ఘ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇంత జరుగుతున్నా పాక్ సైన్యం మాత్రం ఇటీవలి కాలం వరకు ఇమ్రాన్‌కు అండగా నిలిచింది. 2018 నుంచి గతంలో ఏ ప్రభుత్వానికి ఇవ్వనంత మద్దతును పాక్ సైన్యం ఇమ్రాన్ ప్రభుత్వానికి అందిస్తూ వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో సైన్యంతో ఖాన్ సంబంధాలు బెడిసికొట్టినట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుత సంక్షోభంలో తాము తటస్థంగా ఉంటున్నట్లు సైన్యం చేసిన వ్యాఖ్యపట్ల ఇమ్రాన్ తీవ్రంగా స్పందించారు. మానవులు తటస్తంగా ఉండలేరు. మంచి లేదా చెడు ఏదో ఒక పక్షానికి అనుకూలంగానే ఉంటారు. పశువులు మాత్రమే తటస్థంగా ఉంటాయి అని ఇమ్రాన్ చేసిన బహిరంగ వ్యాఖ్య పాక్ సైన్యాన్ని నివ్వెరపరిచింది. పాక్ సైన్యంలో అత్యంత శక్తివంతమైన ఐఎస్ఐ చీఫ్‌గా తన విశ్వసనీయుడినే నియమించాలని ఇమ్రాన్ పట్టుపట్టడం, పాక్ సైన్యం ప్రతిపాదించిన అభ్యర్థిని ప్రభుత్వం తోసిరాజనడంతో సైన్యానికి చీకాకు తెప్పించింది.
2018లో తాను అధికారంలోకి రావడానికి తోడ్పడిన ఐఎస్ఐ చీఫ్‌కి మరోసారి ఆ పదవిని కట్టబెట్టాలని ఇమ్రాన్ ఖాన్ పట్టుపట్టడమే సైన్యంతో తన సంబంధాలను దెబ్బతీసిందని చెబుతున్నారు కానీ, దేశ రాజకీయాల్లో శత్రుపూరిత వాతావరణాన్ని పెంచిపోషించిన ఇమ్రాన్ వైఖరి, పంజాబ్ పాలన, ఆ రాష్ట్ర సీఎం ఆరాచకాలు కూడా సైన్యం వద్ద ఇమ్రాన్ ప్రతిష్టను మసకబార్చినట్లు తెలుస్తోంది.
విదేశీ విధానంలో లుకలుకలు..
విదేశీ విధానానికి సంబంధించి పాక్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు స్పష్టమయ్యాయి. పాక్ స్వతంత్ర విదేశీ విధానాన్ని కలిగి ఉండాలని పైకి చెప్పిన ఇమ్రాన్ వాస్తవానికి గత రెండేళ్లుగా అమరికాకు దూరమై రష్యా, చైనాలకు దగ్గరయ్యారు. పాకిస్తాన్ పట్ల బైడెన్ యంత్రాంగం కఠిన వైఖరి ప్రదర్శించడంతో ఇమ్రాన్ దాదాపుగా అమెరికా నుంచి దూరం జరిగారు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఇంతవరకు పాక్ ప్రధానికి ఫోన్ కాల్ రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొదటినుంచి అమెరికాతో మంచి సంబంధాలను కోరుకుంటూ వచ్చిన పాక్ సైన్యం ఇమ్రాన్ వైఖరిని అస్సలు అంగీరించలేదు. ఇవన్నీ కలిసి పాక్ సైన్యం ఇమ్రాన్ పట్ల కినుక వహించడానికి కారణమయ్యాయి.
చివరి బంతివరకు నిలిచి పోరాడతానని ఆదివారం భారీర్యాలీలో ప్రసంగించిన ఇమ్రాన్, లండన్‌లో కూర్చుని రాజకీయాలు చేస్తున్న పాక్ ప్రతిపక్ష నాయకుడు నవాజ్ షరీఫ్‌ని అనుసరించాలా.. పాక్ స్వాతంత్ర్యంపై విదేశీ కుట్రలకు లొంగిపోవాలా తేల్చుకోండంటూ పాక్ ప్రజలను సవాలు చేశారు. పాకిస్తాన్ ప్రయోజనాలు తప్ప మరి వేటినీ తాను లెక్క బెట్టనని తేల్చి చెప్పారు.
కానీ పాక్ పార్లమెంటులో అవిశ్వాస పరీక్షకు ఇమ్రాన్ నిలబడతారా లేదా చివరి క్షణంలో పాక్ పార్లమెంటును రద్దుచేసి తాజా ఎన్నికలకు సిద్ధపడతారా అనేది తేలాల్సి ఉంది. ప్రజాస్వామ్యం కోసం రాజకీయంగా బలిదానం అవుతున్న పోరాటకారుడిగా తన్ను తాను చిత్రీకరించుకుంటున్న ఇమ్రాన్ చివరి క్షణాల్లో ప్రజలను నమ్మించగలరా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది.
ప్రజాస్వామ్యానికి రెండు విధాలా దెబ్బే..
అధికార పక్షం నుంచి ఫిరాయించిన పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానంపై ఓటు వేయవచ్చా అనే అంశంపై పాక్ సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పు అనుకూలంగా వస్తే తప్ప ఇమ్రాన్ ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పటికీ పాక్ ప్రజాస్వామ్యమే తీవ్రంగా దెబ్బతింటుంది. మార్పు తీసుకొస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఏ మార్పూ తీసుకురాలేకపోవడంతో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు. మరోవైపున అధికారం కోల్పోయినప్పటినుంచి ప్రజా మధ్దతుతో నెగ్గిన ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని పాక్ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూ అనైతిక రాజకీయాలకు పాల్పడడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఇలా ప్రభుత్వ, ప్రతిపక్షాలు రెండింటిపై ప్రజలు విశ్వాసం కోల్పోతే వారికి మిగిలేది అంతిమంగా మరోసారి సైనికపాలనే మరి.