హీరో మోటోకార్ప్ రూ. 1,000 కోట్ల తప్పుడు లెక్కలు!

by Harish |
హీరో మోటోకార్ప్ రూ. 1,000 కోట్ల తప్పుడు లెక్కలు!
X

ఢిల్లీ: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ కార్యాలయాల్లో ఇటీవల ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ లెక్కల్లో అవకతవకలు చూపించిందని ఐటీ శాఖ తెలిపింది. ఇందులో రూ. 1,000 కోట్ల వరకు సొమ్మును వివిధ అవసరాలకు ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చూపినట్టు తేలింది. కంపెనీకి చెందిన ఆర్థిక పత్రాలతో, డిజిటల్ డేటాను అధికారులు జప్తు చేసి, మరింత క్షుణ్ణంగా ఐటీ శాఖ పరిశీలిస్తోంది. స్థిరాస్తి కొనుగోళ్లకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా రూ. 100 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు తేలింది. హీరో మోటోకార్ప్ ఛైర్మన్, ఎండీ పవన్ ముంజల్ ఢిల్లీ శివార్లలో ఫామ్‌హౌస్ కొనుగోలుకు సంబంధించి ఐటీ శాఖ విచారణ జరుపుతోందని, పన్ను ఎగ్గొట్టేందుకు మార్కెట్ ధరలో మార్పులు చేసినట్లు ఈ వ్యవహారంలో తేలిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం స్థిరాస్తి లావాదేవీల్లో రూ. 20 వేలు అంతకంటే ఎక్కువ నగదు రూపంలో అందుకోకూడదు. కానీ, పవన్ ముంజల్ ఫామ్‌హౌస్ కొనుగోలు వ్యవహారంలో రూ. 100 కోట్లు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. కాగా, ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా ఐటీ శాఖ హీరో మోటోకార్ప్ కార్యాలయాలు, పవన్ ముంజల్ నివాసాల్లో సోదాలు జరిపింది. అలాగే, ఢిల్లీలో 40 కి మించి ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా, తాజా వార్తల నేపథ్యంలో మంగళవారం నాటి స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో కంపెనీ షేర్ ధర దాదాపు 7 శాతం పడిపోయి రూ.2,215 వద్ద ముగిసింది.

Advertisement

Next Story