మెరుగైన ఫైనాన్స్ అందించేందుకు ఎస్‌బీఐతో హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యం!

by Disha Desk |
మెరుగైన ఫైనాన్స్ అందించేందుకు ఎస్‌బీఐతో హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ వినియోగదారులకు మెరుగైన రుణ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో ఒప్పందం చేసుకున్నట్టు శుక్రవారం వెల్లడించింది. తక్కువ వడ్డీ రేటుతో పాటు ఇబ్బందుల్లేని రిటైల్ ఫైనాన్స్ ద్వారా తమ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనడానికి ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. గత కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, ఈ సమయంలో కస్టమర్లకు సులభమైన రుణాలను అందించే ప్రక్రియ అవసరమని, అందుకు ఎస్‌బీఐతో తాము చేసుకున్న ఒప్పందం ఎంతో సహాయపడుతుందని తెలిపింది. ఎస్‌బీఐతో భాగస్వామ్యం ద్వారా దేశంలో గ్రీన్ మొబిలిటీ మరింత వేగవంతంగా వృద్ధి సాధిస్తుందని, తక్కువ వడ్డీ రేట్లు, ప్రత్యేక ఆఫర్‌లు కూడా ఇలాంటి సమయంలో వినియోగదారులకు ఎంతో దోహదపడుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 'ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్‌బీఐ పర్సనల్ బ్యాంకింగ్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ దేవేంద్ర కుమార్.. గ్రీన్ మొబిలిటీ విప్లవానికి ఎస్‌బీఐ సహకారాన్ని అందిస్తుందని, భారత్‌ను గ్రీన్ ఎనర్జీ వైపునకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తక్కువ ఈఎంఐ అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు చేరువ అవుతాయని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story