అటవీ ప్రాంతం ఆదివాసులకు గుడ్ న్యూస్.. పోలీసుల చొరవతో..

by Disha News Desk |
అటవీ ప్రాంతం ఆదివాసులకు గుడ్ న్యూస్.. పోలీసుల చొరవతో..
X

దిశ, భద్రాచలం : ఇంతకాలం మావోయిస్టుల సమస్య వలన కనీస అభివృద్ధికి నోచుకోని అటవీప్రాంత ఆదివాసీ గ్రామాలు పోలీసుల చొరవతో నేడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని మావోయిస్టుల ప్రభావం తెలంగాణ శివారు ప్రాంతాలపై పడకుండా ఎక్కడికక్కడ రక్షణ కంచెగా అవసరమైన చోట్ల పోలీస్ స్పెషల్ క్యాంపులు పెట్టి కట్టడి చేయడమే కాకుండా అడవుల్లో కూంబింగ్, గ్రామాల్లో తనిఖీలు చేస్తూనే మరోవైపు అదివాసీగూడెంల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పోలీసుల ప్రత్యేక కృషితో అటవీప్రాంత రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. రహదారి పనులకు ఏ ఆటంకాలు తలెత్తకుండా నిర్మాణం పూర్తి చేసుకుంటే అటవీ ప్రాంతవాసులకు రాకపోకల (కాలినడక) కష్టాలు తీరిపోతాయి. అటవీప్రాంత రహదారులకు త్వరలో మహర్దశ పట్టబోతోందనే ఆనందం అక్కడి ఆదివాసీల్లో వ్యక్తమౌతోంది.

ఫారెస్టు క్లియరెన్స్ కోసం అధికారుల పరిశీలన

చర్ల మండలంలో సుమారు 27కిమీ దూరంతో అటవీప్రాంతంలో ఐదు మార్గాల్లో డబుల్ రోడ్లు మంజూరయ్యాయి. తాలిపేరు ప్రాజెక్టు నుంచి రాళ్లపురం, బట్టిగూడెం గ్రామాల వరకు (5.650 కి.మీ) ఉయ్యాల మడుగు నుంచి తిప్పాపురం వరకు(1.932 కి.మీ), అలాగే తిప్పాపురం నుంచి బట్టిగూడెం వరకు (3.524 కి.మీ), ఎర్రంపాడు నుంచి బట్టిగూడెం వరకు (1.663 కి.మీ), తిప్పాపురం నుంచి బత్తినపల్లి మీదుగా చెన్నాపురం వరకు (15.304 కి.మీ) విశాలమైన రహదారులు మంజూరైనాయి. ఈ రోడ్లు కొంత భాగం రిజర్వ్ ఫారెస్టుగుండా నిర్మించాల్సి ఉంది. ఈ క్రమంలో కొత్తగూడెం ఓఎస్‌డీ తిరుపతి, ఏఎస్‌పీ రోహిత్ రాజ్, చర్ల సీఐ బి.అశోక్, ఎస్‌ఐలు రాజువర్మ, వెంకటప్పలతో కలిసి అటవీశాఖ ప్రిన్సిపల్ ఛీప్ కన్సర్వేటర్ బిఎన్ రెడ్డి నేతృత్వంలోని ముగ్గురు కేంద్ర ఉన్నతాధికారుల బృందం శనివారం రహదారి నిర్మించే అటవీ ప్రాంతాలను పరిశీలించారు. ఈ పర్యటనలో అటవీశాఖ జిల్లా చీఫ్ కన్సర్వేటర్ డి. బీమా, జిల్లా ఫారెస్ట్ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ బి. బీ. బీమ్లా, డీఈఈ హరిలాల్, ఏఈ రాంబాబు, చర్ల ఎఫ్‌ఆర్‌వో పి. ఉపేంద్ర తదితర అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed