జంగారెడ్డిగూడెం మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: మాజీ మంత్రి పీతల సుజాత

by Manoj |
జంగారెడ్డిగూడెం మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: మాజీ మంత్రి పీతల సుజాత
X

దిశ, ఏపీ బ్యూరో : 'జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు, రాష్ట్రాన్ని సారా, మద్యం రహిత రాష్ట్రంగా మార్చేవరకు ముఖ్యమంత్రిని టీడీపీ వదిలిపెట్టదు. జగన్ రెడ్డి అమ్ముతున్న జేబ్రాండ్స్ పాపం ప్రజారోగ్యానికి శాపంగా మారింది. కల్తీసారా, పిచ్చి బ్రాండ్ల మద్యం అమ్మకాలతో వైసీపీ పాలనలో రాష్ట్రంలో నిత్యం మరణ మృదంగాలే. నాటుసారా, జేబ్రాండ్ మద్యం, గంజాయి వంటి వాటిని తన పార్టీ ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రే విక్రయిస్తున్నాడు' అని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 'వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, తమ అనుచరులతో రాష్ట్రంలో యథేచ్ఛగా మద్యం, నాటుసారా, ఇతర మాదకద్రవ్యాల అమ్మకాలు సాగిస్తూ, ముఖ్యమంత్రికి కట్టాల్సిన కప్పాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఏటా రూ.30వేల కోట్ల సంపాదనే లక్ష్యంగా జగన్ రెడ్డి తన కల్తీ మద్యం, సారా వ్యాపారం సాగిస్తూ, పేదల ప్రాణాలు బలిగొంటున్నాడు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో 42మంది చనిపోయారంటే ప్రభుత్వం ఎంతలా నాసిరకం మద్యం, కల్తీ సారా అమ్మకాలు సాగిస్తోందో చెప్పాల్సిన పనిలేదు' అని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు.

సీఎం శవరాజకీయాలు చేస్తున్నారు

'నాటు సారా, కల్తీ మద్యంతో మహిళల తాళిబొట్లు తెగిపోతున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదు. పేదలు, సాదాసీదా ప్రజలంటే జగన్మోహన్ రెడ్డికి చులకన భావం. సారా మరణాలపై చట్టసభల్లో చర్చించకుండా, సహజ మరణాలని ముఖ్యమంత్రి దుర్మార్గంగా మాట్లాడాడు. జంగారెడ్డిగూడెం మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి. 2018లో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని చంద్రబాబు సారారహిత మున్సిపాలిటీగా మార్చారు. ఎక్సైజ్.. పోలీస్ సిబ్బంది సాయంతో టీడీపీ ప్రభుత్వం జంగారెడ్డిగూడెంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా సారా, మద్యం అమ్మకాలు లేకుండా చేసింది. వైసీపీ నేతలు, ఎక్సైజ్ విభాగం కుమ్మక్కవడం వల్లే జంగారెడ్డిగూడెంలో సారా తాగి అమాయకులు చనిపోయారు. చనిపోయిన వారిని అవమానిస్తూ , వారి కుటుంబాలను అవహేళన చేస్తూ ముఖ్యమంత్రే శవ రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు జంగారెడ్డిగూడెం వెళ్తున్నాడని తెలిసి, సారా బాధిత కుటుంబాల వారిని అధికారుల సాయంతో ప్రభుత్వ పెద్దలు భయభ్రాంతులకు గురిచేసింది వాస్తవం కాదా?' అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు.

బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

ఆడబిడ్డల కన్నీళ్లతో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో రాజులు, మహామహులే కాలగర్బంలో కలిసిపోయారు. ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి త్వరగా గ్రహిస్తే మంచిది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న నాసిరకం మద్యం అమ్మకాలు, కల్తీసారా విక్రయాలను ముఖ్యమంత్రి తక్షణమే నిలిపేయాలి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జంగారెడ్డిగూడెంలో నాటుసారానే లేదంటే, ఆప్రాంతంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు ధ్వంసం చేస్తున్న సారా బట్టీలు ఎక్కడివి? సారా తయారీ.. విక్రయం వరకు అంతా వైసీపీ వారే చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమే జంగారెడ్డి గూడెం నాటుసారా మరణాలకు ప్రధాన కారణం. నాటు సారా తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తక్షణమే రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలి. జరిగిన ఘటనపై వెంటనే న్యాయ విచారణకు ఆదేశించాలి అని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు.

Advertisement

Next Story