వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి పీతల సుజాత సవాల్

by Vinod kumar |   ( Updated:2022-03-28 12:33:53.0  )
వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి పీతల సుజాత సవాల్
X

దిశ, ఏపీ బ్యూరో: 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీలపై పక్షపాతం చూపుతున్నారు. దళిత, గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి విషయంలో సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ యువత జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు' అని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పీతల సుజాత మీడియాతో మాట్లాడారు.


'బ్యాక్ లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరీలోకి మారుస్తున్నట్లు ఇటీవలే జగన్ పత్రికలో ఒక ప్రకటన వచ్చింది. ఎస్సీ, ఎస్టీ యువతకు తన మూడేళ్ల పాలనలో జగన్ ఒరగబెట్టిందేమీ లేదు. ఎస్సీ,ఎస్టీ యువతను బలాదూర్లుగా మారుస్తూ వారిని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటూ సర్వనాశనం చేస్తున్నారు' అని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. 'ఎస్సీఎస్టీలకు దక్కాల్సిన బ్యాక్‌లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరీలో మార్చే హక్కు ఎవరు ఇచ్చారు' అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరీలోకి మార్చడమేంటి..?

వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. కనీసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వం నుంచి రాజ్యాంగపరంగా వారికి దక్కాల్సిన ఉద్యోగాలను కూడా వారికి దక్కకుండా ఓపెన్ కేటగిరీలోకి మార్చడాన్ని టీడీపీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిబంధనల ప్రకారం ఎస్సీలకు చెందిన పోస్టులలో వారినే నియమించాలి.


ఆయా పోస్టులకు అన్ని అర్హతలు ఉన్నవారు ఆయా వర్గాల్లో ఎవరూ లేకపోతే.. మూడేళ్లపాటు వేచి చూడాలి. మూడేళ్లు వేచి చూశాక కూడా ఎస్సీల్లో అర్హులైన వారు వారికి సంబంధించిన పోస్టులకు దొరక్కపోతే, బీసీలకు ప్రాధాన్యమివ్వాలి. బీసీల్లో కూడా ఎవరూ అర్హులైన వారు లేకపోతే.. అప్పుడు మాత్రమే ఓపెన్ కేటగిరీలోకి మార్చాలనే నిబంధన రాజ్యాంగమే కల్పించింది.

కానీ ఈ ప్రభుత్వం, ఎస్సీ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను ఎటువంటి నిబంధనలు పాటించకుండా నేరుగా ఓపెన్ కేటగిరీలోకి మార్చేయడానికి సిద్ధమైంది. ప్రభుత్వ తీరు ముమ్మాటికీ ఎస్సీలైన నిరుద్యోగ యువతీ యువకులను దారుణంగా మోసగించడమే అవుతుంది. తాను ముఖ్యమంత్రి అయితే ఆకాశాన్ని నేలకు దించుతాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలు అనేక రకాల హామీలిచ్చాడు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక తన దుర్మార్గపు పాలనతో అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నాడు' అని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు.

బ్యాక్ లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు..

'వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని.. అంతకుముందు ఉన్న ఖాళీలెన్ని.. ఆయన హయాంలో ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాడనే పూర్తి వివరాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి అని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు 2014-2017 మధ్య ఎస్సీలకు సంబంధించి 2,344 బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడంతోపాటు, రెండు డీఎస్సీ లు కలిపి 3,700కు పైగా పోస్టులు భర్తీ చేయడం జరిగింది.


ఏపీపీఎస్సీ.. పోలీస్ శాఖ నియామకాల్లో 4,339ఖాళీలు భర్తీ చేయడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4 లక్షల పైచిలుకు ఎస్సీ యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. ఇవన్నీ మేం చెప్పడం కాదు..ప్రభుత్వ రికార్డులు చూస్తే అసలు వాస్తవాలు ఈ ప్రభుత్వానికి తెలుస్తాయి.

జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఉత్త విస్తరి, మంచినీళ్లు కూడా లేవు. ఆయా వర్గాల యువతకు ఒక్క ఉద్యోగమూ.. ఇచ్చింది లేదు. పాత బ్యాక్ లాగ్ పోస్టులు 20వేల వరకు ఉంటే వాటిని భర్తీ చేయలేదు. ఎస్జీటీ విభాగం కింద దాదాపు 4,600 వరకు ఉద్యోగాలకు జగన్ ప్రభుత్వం మంగళం పాడేసింది. మొత్తంగా ఎస్సీలకు దక్కాల్సిన 30 వేల టీచర్ ఉద్యోగాలకు ముఖ్యమంత్రి పూర్తిగా పాతరేశారు' అని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు.

'ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏ శాఖలో కూడా ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ జరగనేలేదు. వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దళితులకు విద్యను, ఉద్యోగాలను దూరం చేస్తున్న జగన్ ఆఖరికి వారికి నాణ్యమైన వైద్యాన్ని కూడా అందించడం లేదు. చదువుకున్న ఎస్సీ యువతీయువకులు ఉపాధి, ఉద్యోగాలు లేక ఏం చేయాలో తెలియక జగన్ పుణ్యమా అని కూలి పనులు చేసుకుంటున్నారు. దేశభవిష్యత్‌కు వెన్నెముకలా నిలవాల్సిన యువతవెన్ను విరిచేలా జగన్ ఆలోచనలు ఉన్నాయి' అని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed