కళ్యాణానికి ముస్తాబవుతోన్న భద్రాద్రి రామయ్య.. ముమ్మరంగా ఏర్పాట్లు!

by Satheesh |   ( Updated:2022-03-31 14:57:01.0  )
కళ్యాణానికి ముస్తాబవుతోన్న భద్రాద్రి రామయ్య.. ముమ్మరంగా ఏర్పాట్లు!
X

దిశ, భద్రాచలం: భద్రాచలం దివ్య క్షేత్రంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వేడుకలు శ్రీ సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 10న, ఏప్రిల్ 11న శ్రీరామపట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకలకు మరో 10 రోజుల గడువు మాత్రమే ఉండటంతో తుది ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను ప్రముఖులకు దేవస్థానం అధికారులు అందజేస్తు్న్నారు. ఉగాది రోజున సీఎం కేసీఆర్‌కు, గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు దేవస్థానం ఆహ్వాన పత్రికలను అందజేయనుంది.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం పట్టణాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. పట్టణ ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. రామాలయానికి, మిథిలా స్టేడియానికి రంగులు వేసి విద్యుత్ లైట్లను అలంకరించారు. రాములోరి కళ్యాణం, పట్టాభిషేకం జరిపే మిథిలా ప్రాంగణంలో సెక్టార్‌ల వారీగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో రహదారి మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ డివైడర్స్‌కు రంగులు వేస్తున్నారు. ఈ వేడుకలకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు భద్రాచలం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే అధికారులు శ్రీరామనవమి వేడుక నిర్వహణపై పలుమార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

Advertisement

Next Story