తెల్ల జుట్టుకు కారణమయ్యే ఫుడ్స్.. ప్రాణాంతక వ్యాధికి సంకేతం

by Hajipasha |   ( Updated:2022-08-04 14:22:13.0  )
తెల్ల జుట్టుకు కారణమయ్యే ఫుడ్స్.. ప్రాణాంతక వ్యాధికి సంకేతం
X

దిశ, ఫీచర్స్: తెల్ల జుట్టు సమస్య ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. జన్యుపరమైన కారకాలు, ఆహారపు అలవాట్లు, ఆలోచనలు, ఆయిల్ ఫుడ్ ద్వారా జుట్టు తెల్లబడుతుందని నిపుణులు చెప్తుండగా.. తాజా అధ్యయనం ప్రకారం ఇది ప్రాణాంతక వ్యాధిని కూడా సూచిస్తుందని తెలుస్తోంది.

విపరీతమైన కొలెస్ట్రాల్, బ్యాడ్ లిపిడ్స్ లెవెల్స్ రక్తంలో పేరుకుపోయి ధమనుల్లో ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే గుండెపోటు లేదా స్ట్రోక్‌ ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముందస్తు లక్షణాలు లేనప్పటికీ.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్స్(LDL) స్థాయిలు ఎక్కువగా ఉన్నాయో లేదో బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే నిర్ధారించవచ్చని వారు పేర్కొన్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్.. గుండెపోటు లేదా స్ట్రోక్‌ ప్రమాదాన్ని పెంచడమే కాక జుట్టు మీద కూడా ప్రభావం చూపుతుందని జాన్ హాప్కిన్స్ పరిశోధకులు వెల్లడించారు.

సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో.. ఎలుకలకు ఫాస్ట్ ఫుడ్ ఫీడ్ చేసినపుడు కలిగే ప్రభావాన్ని నిపుణులు విశ్లేషించారు. కాగా 36 వారాల తర్వాత.. 75 శాతం ఎలుకల జుట్టు రాలడం, చర్మ గాయాలతో బాధపడటం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలు మొదలైనట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధిక కొవ్వు గల ఆహారాలు తినే పురుషుల్లో జుట్టు రాలటం, తెల్లబడటం వంటి ప్రక్రియ జరుగుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. అందుకే ఆరోగ్యకరమైన జుట్టు కోసం నట్స్, ఎగ్స్, కూరగాయలు, పండ్లు, సాల్మన్, మాకరెల్ వంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story