పత్తి దిగుమతులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును పొడిగించిన కేంద్రం!

by S Gopi |
పత్తి దిగుమతులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును పొడిగించిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: ముడి పత్తి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ను ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీయంగా ధరల నియంత్రణ కోసం ఏప్రిల్‌లో పత్తి దిగుమతులపై సెప్టెంబర్ వరకు కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (ఏఐడీసీ) మినహాయింపు కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీన్ని అక్టోబర్ చివరి వరకు పొడిగిస్తూ తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పత్తి, నూలు ధరలు పెరుగుతున్న కారణంగానే టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని మినహాయింపు పొడిగించాలని కోరింది.

పరిశ్రమల నుంచి కూడా సుంకం లేని పత్తి దిగుమతిని డిమాండ్ చేసిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు పత్తి దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఏఐడీసీ 5 శాతం చొప్పున విధించిన సంగతి తెలిసిందే. సుంకం మినహాయింపు పొడిగించడం ద్వారా టెక్స్‌టైల్ రంగంలోని నూలు, ఫ్యాబ్రిక్, గారెమంట్స్‌కు ప్రయోజనం ఉంటుందని, వినియోగదారులపై అదనపు భారం ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో పత్తి ధరలు ఒక్కో క్యాండీ(356 కిలోలు) రూ. 44,500 ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి రూ. 90 వేలకు చేరుకుంది. పత్తి ధరలు విపరీతంగా పెరగడంతో నూలు, దుస్తుల ధరలపై ఎక్కువ ప్రభావం కనబడుతోంది.

Advertisement

Next Story