ఆతిథ్య రంగాన్ని ఆదుకునేందుకు జీఎస్టీ తగ్గింపు కోరిన పరిశ్రమ సమాఖ్య!

by Harish |
ఆతిథ్య రంగాన్ని ఆదుకునేందుకు జీఎస్టీ తగ్గింపు కోరిన పరిశ్రమ సమాఖ్య!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఆతిథ్య రంగం కోలుకునేందుకు పరిశ్రమలో అమలవుతున్న జీఎస్టీ రేట్లను తగ్గించాలని పరిశ్రమ సమాఖ్య ఎఫ్‌హెచ్ఆర్ఏఐ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఉన్న పన్నులను సమీక్షించాలని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌హెచ్ఆర్ఏఐ) ఆర్థిక మంత్రికి లేఖ రాసింది. కొవిడ్ సంక్షోభం కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించి, పరిశ్రమ మనుగడకు మద్దతివ్వాలని, తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.

ఇందులో భాగంగా హోటళ్లలో రూ. 1000 గదులకు(రోజుకు) సున్నా జీఎస్టీ అమలవుతోందని, దీన్ని రూ. 2,000 అద్దె ఉన్న వాటికీ విస్తరించాలని ఎఫ్‌హెచ్ఆర్ఏఐ సూచించింది. అలాగే, ప్రస్తుతం రూ. 7,500 అద్దె ఉన్న వాటిపై 18 శాతం జీఎస్టీ ఉందని, దీన్ని రూ. 9,500కి పెంచాలని తెలిపింది. అలాగే, అద్దె, ఇతర ఖర్చులపై చెల్లించే జీఎస్టీ వివరాల కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు సొంత రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో చెల్లించే హోటల్ బిల్లులను పరిగణించి సెక్షన్ 80సీ కింద అదనంగా రూ. 50 వేల మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేసింది.

జీఎస్టీ నిబంధనలు సరళీకృతం చేయడం వల్ల ప్రధానంగా చిన్న హోటళ్లకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని, దీనివల్ల వ్యాపారాలు మరింత లాభదాయకంగా నిర్వహించేందుకు వీలవుతుందని వివరించింది. దీనివల్ల పర్యాటకులను ఆకర్షించవచ్చని, తద్వారా హోటళ్లతో పాటు అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందని ఎఫ్‌హెచ్ఆర్ఏఐ వెల్లడించింది.

Advertisement

Next Story