మున్నాభాయ్.. ఎం'డీ'బీఎస్.. చదివింది ఎంబీబీఎస్.. బోర్డు పై ఎండీ

by Mahesh |
మున్నాభాయ్.. ఎండీబీఎస్.. చదివింది ఎంబీబీఎస్.. బోర్డు పై ఎండీ
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: చదివేది ఎంబీబీఎస్.. బోర్డు పై రాసుకునెది ఎండీ.. మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఎందరో.. స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులుగా చెప్పుకుంటూ చలామణి అవుతున్నారు. ఆస్పత్రుల్లో లోపల, బయట బోర్డులపై స్పెషలిస్టులుగా రాసుకుంటున్నారు.. ఇష్టం వచ్చిన పరీక్షలు, మందులు రాస్తున్నారు. అడ్డగోలుగా ఆపరేషన్లు చేస్తున్నారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. వైద్యారోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు వస్తేగానీ స్పందించకపోవటం తో ఇలాంటి నకిలీ డాక్టర్లదే ఇష్టారాజ్యంగా మారింది. ప్రైవేటు ఆస్పత్రులను నాన్ డాక్టర్లు పెడుతుండగా.. ఇలాంటి వైద్యులతో కొత్త దందా చేస్తున్నారు.!

ఉక్రెయిన్ లో ఎండీ చేసిన ఓ వైద్యుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత పరీక్ష రాయకుండానే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్డియాలజిస్ట్ గా కొనసాగుతున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వైద్యం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందటంతో డీఅండ్ఎంహెచ్వో కుమ్రం బాలు, ఇతర వైద్యారోగ్యశాఖ అధికారులు మంచిర్యాలలోని ఓ ఆస్పత్రిపై దాడులు నిర్వహించారు. ఈ ఆస్పత్రిలో కార్డియాలజిస్టు గా పని చేస్తున్న వైద్యుడు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఎంబీబీఎస్ కు సమానమైన విదేశీ ఎండీ సర్టిఫికేటు తో కార్డియాలజిస్టు గా వైద్యం చేస్తున్నారు. దీంతో పూర్తి విచారణ చేసిన అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో న్యూరో అని పెద్ద అక్షరాలతో రాసి బోర్డు పెట్టారు. వాస్తవానికి ఇక్కడ న్యూరాలజిస్టు లేరు. న్యూరాలజీలో ఫెలోషిప్ మాత్రమే చేయగా.. న్యూరో కు డిమాండ్ ఉండటంతో ఏకంగా ఇలా బోర్డు పెట్టారు. అంతేకాదు న్యూరాలజిస్ట్ చేసే పరీక్షలతో పాటు వైద్యం కూడా చేస్తున్నారు. ఎంసీఐ ప్రకారం న్యూరాలజీ లో మూడేళ్ల ఎండీ కోర్సు చేసిన వారు న్యూరో స్పెషలిస్ట్ కిందకి వస్తారు. నాన్ డాక్టర్లు ఓ ఆస్పత్రి పెట్టి.. న్యూరాలజిస్ట్ ఉన్నాడని, న్యూరాలజి వైద్యం చేస్తామని పేద పేషెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవి మచ్చుకు మాత్రమే ఉదాహరణలు. ఇలాంటి వైద్యులు, ఆస్పత్రులు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. చైనా, రష్యా, ఉక్రెయిన్ సహా మరికొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి ఎండీ (ఫిజీషియన్) పట్టా ఇస్తున్నారు. వాస్తవానికి ఆ పట్టా మన దేశంలో ఎంబీబీఎస్ పట్టా తో సమానం. దీనిని స్పెషలిస్టుగా చూపుకుని వైద్యం చేస్తున్నారు. వాస్తవానికి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు ప్రాక్టీస్ చేయాలని భావిస్తే.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లో గుర్తింపు తప్పనిసరి. ఎంసీఐ లో రిజిస్ట్రేషన్ చేసుకుని అర్హత పరీక్ష రాయాల్సి ఉండగా.. అది పాసైతేనే గుర్తింపు ఇస్తారు. ఈ సందర్భంగా 'ఎండీ ఇన్ చైనా, ఉక్రెయిన్ ఈక్వివలెంట్ టు ఎంబీబీఎస్' అని ధృవపత్రం లో ఎంసీఐ స్పష్టంగా పేర్కొంటోంది. అయినప్పటికీ కొందరు వైద్యులు ఆస్పత్రి బోర్డులు, తమ టేబుల్, మందుల చీటి పై ఎండీగా రాసుకుంటున్నారు.

కొందరు కార్డియాలజీ, న్యూరాలజీ కోర్సుల్లో ఆరు నెలల డిప్లోమా చేసి.. కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు అని స్పెషలిస్టుగా చలామణి అవుతున్నారు. మూడేళ్ల ఎండీ కోర్సు చదివితేనే స్పెషలిస్ట్ కిందకి వస్తారు. ఏ దేశంలో చదివారు.. ఎంబీబీఎస్‌కు సమాన డిగ్రీగా బోర్డులపై పేర్కొనాలి. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఫెలోషిప్ చేసిన వారు పరీక్షలు చేయడానికి లేకున్నా.. చేస్తున్నారు. డీజీవో, డీసీ హెచ్, డీఏ మూడింటికే ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వగా.. స్పెషలిస్టు పోస్టులకు, పదోన్నతులకు అర్హులవుతారు. మూడు నెలల కోర్సులు చదివి.. డిప్లోమా ఉందని చలామణి అవుతున్నారు. బోర్డులపై విద్యార్హతలు చూసి నిజంగానే ప్రత్యేకతలు ఉన్న వైద్యులని వస్తే.. అసలుకే మోసం వస్తుంది. అవసరం లేని, అవగాహన లేని పరీక్షలని డబ్బులు గుంజేస్తున్నారు. ఇష్టం వచ్చిన మందులు రాసి.. అడ్డగోలు ఆపరేషన్లు చేసి పేదలను దోచుకుంటున్నారు. చివరికి నయం కాకుంటే.. మరిన్ని పరీక్షలు, మెరుగైన వైద్యంకోసం వేరే ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. సకాలంలో, సక్రమంగా వ్యాధిని నిర్ధారించుకుంటే.. ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది.

నాన్ డాక్టర్లు ఆస్పత్రులు పెట్టడంతోనే అసలు సమస్య ఎక్కువైంది. పెట్టుబడి పెట్టలేక, ఆస్పత్రుల నిర్వహణ చేయలేని వారు ఇలాంటి ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలవారీ వేతనాలకు చేరుతున్నారు. బోర్డు పై ఉండే వైద్యులకు, లోపల వైద్యం చేసే వారి పేర్ల కు సంబంధం ఉండటం లేదు. రెండు, మూడు నెలలకోసారి డాక్టర్ మారుతున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధుల వారికి ఇబ్బందిగా మారింది. ఆయా గ్రామాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీలను మాట్లాడుకుని.. 30-40 శాతం కమిషన్ ఇస్తున్నారు. దీంతో నాన్ డాక్టర్లైన యాజమాన్యాలు చెప్పినట్లు వైద్యులు అనవసర పరీక్షలు, మందులు, ఆపరేషన్లు చేస్తున్నారు. నాన్ డాక్టర్లు కొందరు ప్రైవేటు ఆస్పత్రుల పేరుతో దందా చేసి కాసులు భారీగా దండుకుంటున్నారు. వాస్తవానికి జిల్లాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తరుచూ ఆస్పత్రులను తనిఖీ చేయాల్సి ఉండగా.. మామూళ్ల మత్తులో పడి చేయడం లేదు. కొన్ని చోట్ల ఫిర్యాదులు వస్తేనే తనిఖీ చేస్తున్న.. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.



ఐఎంఏ నుంచి పత్రాలు అడుగుతున్నాం.. డా. అప్పాల చక్రధారి, ఐఎంఏ, నిర్మల్

వైద్యులు తాము ఏ చదువు చదువుతారో బోర్డు, ప్రిస్కిప్షన్ మీద అదే పెట్టుకోవాలి. ఎందులో నిష్ణాతులో అదే వైద్యం చేయాలి. ఏ దేశంలో చదివారు.. డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఏం చదివారో.. ఎంసీఐ నిబంధనల ప్రకారం అమలు చేయాలి. కొత్తగా వచ్చిన వారిని, ప్రాక్టీస్ పెడుతున్న వారిని ఐఎంఏ తరఫున అన్ని పత్రాలు అడిగి తీసుకుంటున్నాం. ఎంసీఐ గుర్తింపు లేకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవు.

Advertisement

Next Story

Most Viewed