TRS కు బిగ్ షాక్... మాజీ ఢిల్లీ అధికార ప్రతినిధి రాజీనామా

by S Gopi |   ( Updated:2022-07-23 07:26:13.0  )
EX TRS Delhi Official Representative Ramachandru Naik Tejavath Quits TRS
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: EX TRS Delhi Official Representative Ramachandru Naik Tejavath Quits TRS| టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పార్టీలో కొన్నేళ్లుగా ఉంటూ సేవలందిస్తున్న నేతలను పట్టించుకోకపోవడం, పార్టీకి వారి సలహాలు, సూచనలు అందిస్తున్నా తీసుకోకపోవడంతో సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉంటూ కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నా కేవలం నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు తప్ప.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు ఇప్పటికే పార్టీ మారేందుకు ప్లాన్ చేసుకుంటుండగా.. ఇంకొందరేమో పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ.. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి అధికార ప్రతినిధిగా పని చేసిన తేజావత్ రాంచంద్రునాయక్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లెటర్ ను పార్టీ పెద్దలతో పాటు ప్రగతిభవన్ వర్గాలకు కూడా పంపారు. ఈ సందర్భంగా 'దిశ' ప్రతినిధి రాంచంద్రునాయక్ ను సంప్రదించగా.. ఏళ్లుగా పార్టీలో ఉన్నా అగ్రకుల నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఒక ఆదివాసీ బిడ్డ అయిన ముర్ముకు సపోర్ట్ చేయకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. కేవలం ఓట్ల కోసమే టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంటూ మాట్లాడుతోందని.. కానీ ఆయా వర్గాలపై వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. ఏది ఏమైనా పార్టీలో సీనియర్ల పరిస్థితి బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాజీనామా లేఖను పంపించిన రాంచంద్రునాయక్ తర్వాత ఏ పార్టీలో చేరుతారనే విషయం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీలో ఢిల్లీ స్థాయి సీనియర్ నేత రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి: చదువుకోవాలని ఉంది... రోడ్డు వేయండి సార్ (వీడియో)



Advertisement

Next Story

Most Viewed