అలా చేస్తే మునుగోడు ఎడారిగా మారడం ఖాయం: మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి

by Satheesh |
అలా చేస్తే మునుగోడు ఎడారిగా మారడం ఖాయం: మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి
X

దిశ, మునుగోడు: సాగునీటి వనరులు లేని మునుగోడు ప్రాంతంలో ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి ఈ ప్రాంతం ఎడారిగా మారడం ఖాయమని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు భూగర్భ జలాలపై జరిగిన రైతు సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఫ్లోరైడ్ కరువు పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండగా.. మరో పక్క ఈ ప్రాంత వాగులలో ఇసుక సమృద్ధిగా లేకపోయినా వాగులలో ఇసుక కనీసం ఆరు ఫీట్లు పైబడి లభిస్తేనే ఇసుక రీచ్లకు అనుమతి ఇవ్వాలన్నారు. కానీ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తూ రీచ్‌లు ఏర్పాటు చేయడం పర్యావరణాన్ని దెబ్బతీయడమేనన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల పేరుతో ప్రభుత్వం సహజ వనరులను దోచుకుంటున్నారన్నారు. కనీసం సాగునీటి వనరులు లేని మునుగోడు ప్రాంతంలో అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులతో కుమ్మకై ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు పెద్దవాగు నుండి ఇసుక తరలిస్తే గ్రామీణ మంచినీటి పథకాలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు రైతులు సమిష్టిగా ఇసుక తరలింపును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మండల అధికారులు ప్రజల అవసరాలకు, అభివృద్ధి పనులకు మాత్రమే వాగుల నుండి ఇసుక అనుమతి ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story