మరో గ్రామ పంచాయతీకి అడుగులు..?!

by Sumithra |
మరో గ్రామ పంచాయతీకి అడుగులు..?!
X

దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని తుమ్మన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సంగం (కె) ప్రత్యేక గ్రామపంచాయతీగా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. గ్రామస్తులు ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, కమిషనర్, జిల్లా కలెక్టర్ కు కలిసి ప్రత్యేక గ్రామపంచాయతీ కోసం వినతి పత్రాలు సమర్పించారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు గురు, శుక్రవారం గ్రామంలో ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్తుల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం 500 మంది జనాభా కలిగి ఉన్న తాండాలను, గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించాలని ఉంది. గ్రామంలో 513 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి తుమ్మన్ పల్లి పంచాయతీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

అదేవిధంగా ప్రతి నెల రేషన్ సరుకుల కోసం సమీపంలో ఉన్న నర్సాపూర్ గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. గ్రామస్తులు పనుల నిమిత్తం తుమ్మన్ పల్లి వెళ్లేందుకు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. చట్టంలో అవకాశం ఉన్న తమ గ్రామాన్ని ఎందుకు గ్రామపంచాయతీగా ప్రకటించలేదని పలువురిని, మంత్రులను అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దీంతో కదలిన ప్రభుత్వ యంత్రాంగం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి సంగం(కె) గ్రామస్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. సేకరించిన ప్రతులను మంత్రులకు సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే సంగం (కె)గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల తర్వాత పంచాయతీని విడదీస్తే ఉపయోగం లేదని తక్షణమే పంచాయతీని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

Advertisement

Next Story