గణిత ప్రదర్శనతో ఎంతో ప్రయోజనం

by Sridhar Babu |   ( Updated:2024-12-21 12:01:20.0  )
గణిత ప్రదర్శనతో ఎంతో ప్రయోజనం
X

దిశ, భద్రాచలం : గణిత పితామహుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా స్థానిక లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన గణిత ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు, రమేష్ బాబు మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త రామానుజం అని గుర్తు చేశారు. 20వ శతాబ్దంలోని గణిత పితామహులలో శ్రీనివాస రామానుజం ఒకరు అని అన్నారు. అటువంటి గణిత మేధావి జయంతి సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన గణిత ప్రదర్శన ఎంతో ఉపయోగకరమని స్పష్టం చేశారు.

మహనీయుల జయంతుల సందర్భంగా విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యా సంస్థలలో మొదటి నుండి మేధావుల, ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా వ్యాసరచన, క్రీడా, సాంస్కృతిక, కళా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, తద్వారా విద్యార్థులలో భయాందోళనలు, స్టేజీ ఫియర్ పోతుందన్నారు. ఈ గణిత ప్రదర్శనను నన్నపనేని మోహన్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రారంభించగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్. బాబురావు, విద్యాసంస్థల కో డైరెక్టర్ మాగంటి సాయి సూర్య తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story