లింగంపల్లి స్టేషన్‌లో నూతన ఆర్‌పీఎఫ్‌ కేంద్రం: అరుణ్‌ కుమార్‌ జైన్‌

by Satheesh |
లింగంపల్లి స్టేషన్‌లో నూతన ఆర్‌పీఎఫ్‌ కేంద్రం: అరుణ్‌ కుమార్‌ జైన్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన రైల్వే రక్షక దళం(ఆర్‌పీఎఫ్‌) కేంద్రాన్ని సికింద్రాబాద్‌ డివిజన్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. సోమవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ రైల్వే రక్షక దళం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌ ఒకటని, ప్రస్తుతానికి ఈ స్టేషన్‌ మీదుగా దాదాపు 17 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 56 ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయన్నారు. ఈ స్టేషన్‌ను ప్రతి రోజు సగటున 20,000 మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్టేషన్‌లో ప్రయాణికుల పెరుగుదలతో హైదరాబాద్‌ నగరంలో ఇది ప్రధాన కోచింగ్‌ టెర్మినల్‌లో ఒకటిగా నిలిచిందన్నారు.

ఈ స్టేషన్‌ హైదరాబాద్‌ నగరంలో పశ్చిమం వైపున ఉందన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని, హైటెక్‌ సిటీ, సైబర్‌ టవర్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మొదలగు ముఖ్యమైన ప్రాంతాల ప్రయాణికులకు లింగంపల్లి రైల్‌ టెర్మినల్‌ సమీపంలో ఉందన్నారు. లింగంపల్లి వంటి రద్దీ స్టేషన్‌లో 24 గంటలూ నిరంతరం పర్యవేక్షణకు ఆధునిక సాంకేతికతతో కూడిన పరికరాలు ఏర్పాటు చేయబడ్డాయని అన్నారు. ప్రయాణికుల భద్రత పెంపులో భాగంగా కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేశారని వివరించారు. దీని ద్వారా నిఘా వ్యవస్థ సూక్ష్మంగా పరిశీలించవచ్చని ఇది భద్రతకు ఎంతో దోహదపడుతుందని, రైల్వే స్టేషన్‌ పరిసరాలలో రైల్వే ఆస్తులను పరిరక్షించవచ్చని అన్నారు.

ప్రయాణికుల భద్రత విషయంలో, వారి వస్తువులకు రక్షణగా ఉండాలని ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి సూచించారు. రైల్వే పరిసరాల్లో భద్రతా అంశాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలన్నారు. జనరల్‌ మేనేజర్‌ నూతనంగా నిర్మించిన ఆర్‌పీఎఫ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఈశ్వర్‌ రావు, సికింద్రాబాద్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ ఎకె గుప్తా, ప్రధాన కార్యాలయం, డివిజన్‌ కార్యాలయంలోని ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఔరంగాబాద్- సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు..

ఇటీవల ముంబాయి నుంచి సికింద్రాబాద్, ముంబాయి నుంచి ఆదిలాబాద్ రైళ్లు రద్దయిన ( కొన్ని పాక్షికంగా) కారణంగా వాటి స్థానంలో ఔరంగాబాద్- సికింద్రాబాద్‌( రిజర్వ్‌), ఔరంగాబాద్- హెచ్ఎస్ నాందేడ్(అన్ రిజర్వ్) గల ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed