- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి చూపు ఎటువైపు.. అన్ని పార్టీల్లో అసమ్మతి నేతలు!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర పైగా గడువు ఉన్నా.. నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు వేటలో పడుతున్నారు. సొంత పార్టీలో అవకాశాలు రాకపోవడంతో.. తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఏళ్లుగా పార్టీ సేవ చేస్తున్న సీనియర్లు, కొత్తగా చేరిన నేతలకు అవకాశాలు ఇవ్వకపోవడంతో.. రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోంది. పార్టీని వీడాలా.. వద్దా.. వేరే పార్టీలో చేరితే అవకాశాలు వస్తాయా.. లేదా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. టీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వంలోకి వస్తుందా.. స్థానిక పరిస్థితులు ఎలా ఉంటాయనే విశ్లేషణలు, సన్నిహితులతో మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే అభిప్రాయ సేకరణ ప్రారంభించిన నేతలు.. కొంతకాలం పాటు వేచి చూడాలనే యోచనలో ఉన్నారు..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పార్టీల్లోనూ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచనలో పడ్డారు. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర పైగా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే తమ భవిష్యత్తు వేటలో ఉన్నారు. అధికార పార్టీలో మొదటి నుంచి పని చేసిన నేతలు అవకాశాలు రాక ఇతర పార్టీల వైపు చూస్తుండగా.. మిగతా పార్టీల్లోని నాయకులు కూడా తమ పరిస్థితి ఏంటనే యోచనలో పడ్డారు.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించి భంగపడిన నాయకులు, ఇటీవల పార్టీ పదవులైన జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కక అధికార పార్టీలోని చాలా మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. భవిష్యత్తులోనూ పార్టీ, ప్రభుత్వ పదవుల్లో అవకాశం వస్తుందో.. లేదోననే బెంగ పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆందోళన మొదలైంది.
అధికార పార్టీలో సీనియర్లుగా ఉన్న మాజీ ఎంపీ గొడం నగేష్, మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవింద్ రెడ్డి, నల్లాల ఓదేలు, నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, కూచాడి శ్రీహరిరావు, వల్లకొండ సత్యనారాయణ గౌడ్, అరిగెల నాగేశ్వరరావు, బాలూరి గోవర్ధన్ రెడ్డి లాంటి సీనియర్లు పార్టీ, ప్రభుత్వ పరంగా సరైన అవకాశాలు ఇవ్వకపోవటం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు, డీసీసీబీ చైర్మన్ పదవుల్లో అవకాశం రాకపోవటంతో.. పార్టీ తమను గుర్తించటం లేదనే భావనతో ఉన్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం సేవలందిస్తుంటే.. సరైన ప్రాధాన్యత దక్కటం లేదనే ఆవేదనతో ఉన్నారు. వీరంతా తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆందోళనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అవకాశం వస్తుందో.. లేదోననే బెంగ పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండాలా.. వద్దా.. మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందా.. లేదా.. స్థానిక ఎమ్మెల్యే మరోసారి గెలుస్తారా.. లేదా.. అనే సమాచారం తమ సన్నిహితుల నుంచి సేకరిస్తున్నారు.
మరోవైపు ఇటీవల బీజేపీలో చేరిన కాగజ్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్వాయి హరీష్ బాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకులు ఆయనతో మాట్లాడినట్లు తెలిసింది. బీజేపీలో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు. దీంతో తమకు టికెట్ వస్తుందో లేదోనని ఆందోళన మొదలైంది. ఇప్పుడు కొందరు నాయకులు రాజకీయ భవిష్యత్తుపై తమ సన్నిహితులతో చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కొంత అసంతృప్తితో ఉన్నారు. గతంలో పార్టీ పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన కాంగ్రెస్‌ను వీడరని.. పార్టీలోనే కొనసాగుతారని తెలుస్తోంది.