బల్క్ వినియోగదారులకు డీజిల్‌పై రూ. 25 పెంచిన చమురు కంపెనీలు!

by Vinod kumar |   ( Updated:2022-03-20 13:17:05.0  )
బల్క్ వినియోగదారులకు డీజిల్‌పై రూ. 25 పెంచిన చమురు కంపెనీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 140 డాలర్లకు పెరిగింది. పలు దేశాల్లో ఇంధన ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం ఎన్నికల కారణంగా ప్రభుత్వం రిటైల్ ధరలను పెంచలేదు. అయితే, తాజాగా బల్క్ వినియోగదారులకు మాత్రం ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.


డీజిల్ లీటర్ ధరను ఏకంగా రూ. 25 వరకు పెంచాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 40 శాతం వరకు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చమురు కంపెనీలు వివరిస్తున్నాయి. కానీ, పెట్రోల్ బంకుల్లో విక్రయించే రిటైల్ ధరలను పెంచడం లేదని, బల్క్‌గా కొనే వారికి మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయని కంపెనీలు పేర్కొన్నాయి.

ప్రస్తుతానికి ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర బల్క్‌గా రూ. 115 గా ఉండగా, రిటైల్ బంకుల్లో రూ. 86.67 వద్ద ఉంది. ముంబైలో రూ. 122 వద్ద ఉండగా, రిటైల్ ధర రూ. 94.14గా ఉంది. సాధారణంగా బల్క్‌ వినియోగదారులకు వర్తించే ధరలు రిటైల్‌ ధరలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అధిక ధరల నుంచి ఉపశమనం కోసం బల్క్ వినియోగదారులు పెట్రోల్‌ పంపుల వద్దకు వెళ్తున్నారు. పెట్రోల్, డీజిల్‌లను ఆర్డర్ చేసుకునే ట్రావెల్ సర్వీసుల వారు, మాల్స్ కూడా ఇప్పుడు రిటైల్ బంకులపైనే ఆధారపడుతున్నాయి. దీనివల్ల పెట్రోల్‌ పంపుల వద్ద ఇంధన అమ్మకాలు పెరగడంతో రిటైల్‌ పెట్రోల్ పంపుల వారికి నష్టాలు పెరిగాయి.


ముఖ్యంగా జియో-బీపీ, నయారా ఎనర్జీ, షెల్‌ లాంటి ప్రైవేటు రిటైల్‌ కంపెనీలు ఎక్కువ నష్టాల్ని చూస్తున్నాయి. గత కొంతకాలంగా ధరల పెరగకపోవడంతో రాయితీలో చమురును తీసుకునే ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేట్ కంపెనీలకు భారం పెరుగుతోంది. దీంతో ఈ కంపెనీలు బంకులను మూసేయాలని ఆలోచనలో ఉన్నాయి.

Advertisement

Next Story