పోలీసులు అర్ధరాత్రి అలా చేశారని స్టేషన్ ఎదుట ధర్నా

by Nagaya |
పోలీసులు అర్ధరాత్రి అలా చేశారని స్టేషన్ ఎదుట ధర్నా
X

దిశ, అడ్డగూడూర్ : అడ్డగూడూరు పోలీసులు మరో వివాదంలో చిక్కేలా కనిపిస్తోంది. గతంలోనే మరియమ్మ లాకప్ డెత్ కేసులో అబాసుపాలైన ఈ స్టేషన్ పరిధిలో మరో వివాదం చెలరేగింది. ఫిబ్రవరి 3న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అడ్డగూడూరు మండల కేంద్రంలో బీటీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసి 24 గంటలు గడవకముందే శిలాఫలకం ధ్వంసం కావడంతో టీఆర్ఎస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు గూడెపు నాగరాజు, మందుల వెంకటేష్‌పై ఆరోపణలు రావడంతో వారిని అనుమానితులుగా శుక్రవారం తెల్లవారు జామున అరెస్ట్ చేసి మోత్కూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ గుడిపాటి నర్సయ్య అడ్డగూడూర్ ఎస్ఐ ఉదయ్ కిరణ్‌తో మాట్లాడారు. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. దానికి ఎస్ఐ నిరాకరించడంతో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులను విడుదల చేయాలని ఆ పార్టీ శ్రేణులు మోత్కూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సుమారు రెండు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేశారు.కేసుతో ఏ సంబంధం లేని వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగూడూరు మండల అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య, యాదవ్, నాయకులు గూడెపు పాండు, మోత్కూర్ మండల నాయకులు నాగరాజు, వెంకటేష్, బాధుతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story