మంత్రి పదవి తీసేస్తే హాయిగా ఉంటుందంటున్న డిప్యూటీ సీఎం

by Vinod kumar |
మంత్రి పదవి తీసేస్తే హాయిగా ఉంటుందంటున్న డిప్యూటీ సీఎం
X

దిశ, ఏపీ బ్యూరో: మంత్రి పదవి తీసేస్తే హాయిగా ఉంటుందంటూ.. డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి కీల‌క వ్యాఖ్యలు చేశారు. మంత్రి ప‌ద‌వి ఉంటుందా ఊడుతుందా అనే దానిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి పోతే బాధపడటానికి తానేం అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. తమకు మంత్రిపదవులు ఇచ్చేటప్పుడే సీఎం జగన్ కేబినెట్‌ను మారుస్తామని ప్రకటించారని అన్నమాట మేరకు కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారని చెప్పుకొచ్చారు.


చిత్తూరు జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు పలికే అర్హత చంద్రబాబు, లోకేశ్‌లకు లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఎన్టీఆర్‌కు వారసులు కాలేరని విమర్శించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చూపించుకోవాలంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు.

చంద్రబాబు, లోకేశ్‌లు ఎన్టీఆర్ వారసులు కాలేరు..

చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లకు దివంగత సీఎం ఎన్టీఆర్‌ పేరు పలికే అర్హత లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధం, రూ. 2 బియ్యం పథకాలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు వారసులెలా అవుతారని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తారని మిగిలిన సమయాల్లో పట్టించుకోరని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఫోటో లేకుండా టీడీపీ ఒక్క సీటు అయినా గెలవగలరా? అని ప్రశ్నించారు.


వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లకు ధైర్యం ఉంటే సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. అసలు కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా? అని నిలదీశారు. పేదవాడి పట్ల చంద్రబాబుకు ప్రేమ లేదు. పేదల కష్టాలను ఏనాడు చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు లేవని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్‌ అంటే వైసీపీకి ఎంతో గౌరవం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పాలనలో నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలకు కొత్త హంగులు తీసుకొచ్చారు. నవరత్నాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్ పథకాలను అమలు చేశాడా? కనీసం ప్రజా సంక్షేమం కోసం ఒక్క పథకమైనా అమలు చేశారా అని నిలదీశారు. చంద్రబాబు సారా వ్యాపారం చేయడంలో దిట్ట అని ఘాటుగా విమర్శించారు.


ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు కాదని తమ పార్టీకి, సీఎం వైఎస్ జగన్‌కు విపరీతమైన గౌరవం ఉందన్నారు. అందువల్లే ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పైనా విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండా ప్రజల్లో వచ్చి సత్తా చూపించాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed