పడకేసిన పట్టణ ప్రణాళిక

by Kalyani |
పడకేసిన పట్టణ ప్రణాళిక
X

దిశ, చైతన్య పురి : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది జిహెచ్ఎంసి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. మరి ముఖ్యంగా ఆదాయం వచ్చే పట్టణ ప్రణాళికలో దారుణం. ప్రస్తుతం ఎల్బీనగర్ జోన్ లోని సరూర్ నగర్ సర్కిల్ 5, ఎల్బీనగర్ సర్కిల్ 4 లోని పట్టణ ప్రణాళికలో అనుమతులు ఇవ్వాల్సిన సంబంధిత సిబ్బంది లేకపోవడం వలన పట్టణ ప్రణాళిక పడకేసింది. సిబ్బంది లేకపోవడం మూలంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. తద్వారా పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

సమస్య ఏమిటి..

ఎల్బీనగర్ జోన్ లో 1 నుండి 5 సర్కిల్ లు ఉన్నాయి. ఇక్కడ సర్కిల్ నెంబర్ 5 లో పట్టణ ప్రణాళిక విభాగం లో పనిచేసే ఏసీపీ, సూపర్ వైజర్ లు బదిలీ జరిగి దాదాపు 5 నెలలు దాటింది. బదిలీలు జరిగిన స్థానంలో సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం వలన నిర్మాణం అనుమతులు కావాలని కార్యాలయానికి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని కార్యాలయానికి వచ్చి సంబంధిత పత్రం అధికారులకు చూపించి వెళదామంటే ఎవరూ లేకపోవడం మూలంగా నిర్మాణం దారులు దిక్కుతోచని స్థితిలో వెనుదిరుగుతున్నారు.

పని భారంతో..

సరూర్ నగర్ సర్కిల్ కు ఏసీపీ, టీపీఎస్ సిబ్బంది లేకపోవడం వలన ఎల్బీనగర్ సర్కిల్ ఏసీపీ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతో పని భారం ఎక్కువై నిర్మాణం అనుమతులపై దృష్టి సారించడం లేదనే అపోహ ఉంది. దానికి తోడు ఇటీవల ప్రభుత్వం కుటుంబ, కుల, ఆర్థిక సర్వే ప్రారంభించడం వల్ల ఆయన సమయం మొత్తం సర్వే కు కేటాయించారు. తర్వాత కార్యాలయం పనులు చక్కబెడదామంటే నిత్యం ఇతర పనులు చూడడం వలన అసలు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. తద్వారా పాలనపై దృష్టి సారించలేక పోతున్నారు.

కూల్చివేతలు వెయ్యి పైనే..

ఇదిలా ఉండగా ఎల్బీనగర్ జోన్ లోని సర్కిల్ 3, 4, 5 లలో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా సాగుతుండగా వివిధ వర్గాల ద్వారా అధికారులకు ఫిర్యాదులు వందల సంఖ్యలో అందాయి. వాటిని పరిష్కరించడానికి ఉన్న సిబ్బందికి సమయం సరిపోవడం లేదు. అక్రమ కట్టడాలు తొలగించాలంటే ఈ విషయం కోర్టులో కేసు నడుస్తుందని అధికారులు అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడం లేదు. ఇదే అదునుగా భావించిన అక్రమ నిర్మాణందారులు యథేచ్చగా తమ పని కానిస్తున్నారు. ఈ విషయమై సరూర్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుజాత శ్రీధర్ ను వివరణ కోరగా ఏసీపీ, టీపీఎస్ లేకపోవడం మూలంగా కార్యాలయంలో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ విషయం పై పలుమార్లు జోనల్ కమిషనర్ కు విన్నవించినట్లు తెలిపారు. సిబ్బందిని సర్దుబాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణదారుల ఫిర్యాదులు దాదాపు 1000కి పైగా రావడం జరిగిందన్నారు. కోర్టు తీర్పు అనంతరం వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story