Local Elections: ఉంగరం.. కత్తెర! స్థానిక సంస్థల గుర్తులు రెడీ

by Shiva |
Local Elections: ఉంగరం.. కత్తెర! స్థానిక సంస్థల గుర్తులు రెడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్​ రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందుస్తుగా చేసి పెట్టుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచు​ల పదవీ కాలం ముగియగా, జూలై 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసింది. ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్‌కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ ప్రకారం ఒక్కో జిల్లాలో మండలాలకు మూడు విడతలుగా ఎలక్షన్స్ నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్‌ ​ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సర్పంచ్‌కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్‌ ​కలర్ బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిల్లో వార్డులు 1.14 లక్షల వార్డులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.67 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీటికి అదనంగా 10 % బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకే సారి బ్యాలెట్​ పేపర్‌​ను ముద్రించడం కష్టం కావడంతో ముందుగానే పేపర్‌ను ముద్రించుకుంటున్నారు.

ముందస్తుగానే ప్రారంభమైన ముద్రణ

గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచ్​‌తో పాటు వార్డు సభ్యులకు ఓటింగ్‌ ​నిర్వహిస్తారు. ఒక్కో ఓటరు రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది. పార్టీ రహితంగా జరిగే ఈ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ​పేప‌ర్‌​పై అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో ప్రకటిస్తారు. అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. మొదటి అభ్యర్థికి మొదటి గుర్తు, రెండో అభ్యర్థికి రెండో గుర్తు విధానాన్ని అవలంభిస్తారు. వార్డు సభ్యులకూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. దీని కోసం సర్పంచు​లు, వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. వార్డులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎక్కువ బ్యాలెట్​ పేపర్లను ముద్రించాల్సి ఉంటుందనే ఉద్దేశంగా ముందస్తుగా బ్యాలెట్‌ ​పేపర్లను ముద్రించి పెట్టుకుంటున్నారు.

రాష్ట్రానికి చేరిన 70 వేల బ్యాలెట్ బాక్సులు

సర్పంచ్‌కు గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించారు. వీటితో పాటుగా రెండింటి మీద నోటా గుర్తును కూడా ముద్రించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఎన్నికలకు బ్యాలెట్​‌ బాక్సులను సిద్ధం చేశారు. ఒక్కొ వార్డు సభ్యుడికి చిన్న బ్యాలెట్‌ ​బాక్సు, సర్పం‌చ్‌​కు పెద్ద బ్యాలెట్‌ ​బాక్సు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద బ్యాలెట్​ బాక్సులను ఇతర రాష్ట్రాల నుంచి సేకరించారు. ఇతర రాష్ట్రాల నుంచి 70 వేల బ్యాలెట్​‌ బాక్సులు వచ్చాయి. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్​ రాష్ట్రాల నుంచి బాక్సులను తెప్పించారు. బ్యాలెట్‌ ​బాక్సులకు సంబంధించిన సీళ్లు, చిరునామా ట్యా‌గ్‌​లను ఇప్పటికే ముద్రించారు. తాజాగా సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. బ్యాలెట్​ పేపర్లను 3, 5, 8, 10, 15, 20, 25 ఇలా గుర్తులు ఉండే విధంగా ప్రింట్ చేశారు. వీటిని ఆయా జిల్లాకేంద్రాల్లో భద్రపరుస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్​ విడుదల కాగానే ఆయా మండలాలకు వీటిని పంపిణీ చేస్తారు. అక్కడ స్థానికంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని వినియోగించుకుంటారు.

30 మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్‌లో గుర్తులు

సర్పంచ్ అభ్యర్థికి మొదటి గుర్తు ఉంగరం, రెండో గుర్తు కత్తెర, ఆ తర్వాత బ్యాట్, ఫుట్‌​బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, ​టూత్‌​ పేస్టు, స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్​ బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్​లు ఉంటాయి. మొత్తం 30 మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్‌ ​పేపర్‌ను ముద్రించారు.

వార్డు సభ్యులకు 20 గుర్తులు

వార్డు సభ్యులకు ప్రత్యేకంగా సింబల్స్ ఉంటాయి. వీటిని కూడా ముద్రించారు. వార్డు సభ్యులకు మొదటి గుర్తుగా గౌను, గ్యాస్ స్టవ్, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్​ యాంటెనా, గరాటా, మూకుడు, ఐస్​ క్రీం, గాజు గ్లాసులను మొత్తం 20 గుర్తులుగా ఉండే విధంగా బ్యాలెట్‌ పేపర్‌​ను ముద్రించారు.

Advertisement

Next Story