T.BJP: అక్కడేదో మతలబు జరిగింది.. ఎవరి కోసం కుదించారో చెప్పాల్సిందే

by Gantepaka Srikanth |
T.BJP: అక్కడేదో మతలబు జరిగింది.. ఎవరి కోసం కుదించారో చెప్పాల్సిందే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అలైన్ మెంట్‌లో గత ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందని, ట్రిపులార్ అలైన్ మెంట్‌ను ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్లకు ప్రతిపాదనలు చేసి నల్లగొండ ప్రాంతంలో మాత్రం 28 కిలోమీటర్లకు కుదించారని, దీన్ని ఎవరి కోసం కుదించారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ట్రిపులార్ బాధితులు శుక్రవారం లక్ష్మణ్‌ను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల భువనగిరి, నల్లగొండకు చెందిన ప్రాంతాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో దాదాపు మూడుసార్లు ఈ ప్రాంత ప్రజలు భూములు కోల్పోయారని వివరించారు.

అలైన్ మెంట్ మార్పులో ఏదో మతలబు జరిగిందని తమతో పాటు కాంగ్రెస్ కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ను ప్రశ్నించిందని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రియాంకగాంధీ కూడా ఈ అంశంపై స్పందించారని, అశాస్త్రీయంగా జరిగిన అలైన్ మెంట్ వల్ల ప్రజలు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. హెచ్ఎండీఏ పరిధి దాటి అలైన్ మెంట్ ఉండాలనేది శాస్త్రీయ పద్ధతి అని, కానీ హెచ్ఎండీఏ పరిధిలోనే ఉండేలా అలైన్ మెంట్ ఉందని ఆయన ఫైరయ్యారు. కొంత మందికి మేలు చేసేలా అలైన్ మెంట్ ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఎంపీలుగా కొనసాగిన పలువురు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారని, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఎందుకు వారికి న్యాయం చేయడంలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడంలేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బాధిత రైతులకు న్యాయం చేయకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారన్నారు. కొద్దిమంది పెద్దలకు మేలయ్యేలా కాకుండా.. పేదలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన పట్టుపట్టారు. అండగా నిలవాల్సిన మంత్రులు నిస్సహాయంగా ఎందుకు మారారని, ఎందుకు దీని నుంచి తప్పించుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఈ అంశంపై పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో చర్చించి దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమవుతామని లక్ష్మణ్ హెచ్చరించారు. లక్ష్మణ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story