Happy Life : 2025లో సంతోషంగా ఉండాలా..? అయితే మీరు మారాల్సిందే!!

by Javid Pasha |   ( Updated:2024-12-28 16:17:47.0  )
Happy Life : 2025లో సంతోషంగా ఉండాలా..? అయితే మీరు మారాల్సిందే!!
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం.. ప్రతీ గంట.. కాలం పరుగెడుతూనే ఉంది. చూస్తుండగానే గిర్రున ఏడాది గడిచిపోయింది. ఇంకో 28 గంటలు దాటితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. అయితే ఏంటి అనుకుంటున్నారా? చాలా మందికి తాము ఏం సాధించామో మరోసారి వెనక్కి తిరిగి చూసుకునే సందర్భమిదే. గతేడాది పెట్టుకున్న లక్ష్యాలు, అనుకున్న పనులు ఎంత వరకు నెరవేరాయో నెమరు వేసుకునే తరుణమూ ఇదే. అట్లనే కొంగ్రొత్త ఆలోచనలతో, లక్ష్యాలతో కొత్త సంవత్సరంలో తాము మారాలనుకేనేవారికి కూడా ఇది సందర్భమే. అందుకే చాలా మంది జరిగిందేదో జరిగింది. గతమంతా ఏదోలా గడిచింది. ఈ కొత్త సంవత్సరం నుంచైనా సంతోషంగా ఉండాలని భావించే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారికోసం నిపుణుల సూచనలేమిటో చూద్దాం.

ఓవర్ థింకింగ్ వద్దు

మీరు పుట్టి పెరిగిన వాతావరణం, చుట్టు పక్కల సామాజిక పరిస్థితులు, ఆపదలు, ఆటంకాలు, సంతోషాలు, సరదాలు ఇలా ప్రతీ అనుభవం మీకు ఏదో ఒకటి నేర్పి ఉంటుంది. అవన్నీ మీలో కొన్ని ఆలోచనలు స్థిరపడేలా, వ్యక్తిత్వం రూపు దిద్దుకునేలా కూడా సహాయపడి ఉండవచ్చు. అయితే అవన్నీ మీకు మేలు చేసేవి అయినప్పుడు సమస్యలేమీ ఉండవు. కానీ కొన్ని ఆలోచనలు కాలంతోపాటు మిమ్మల్ని మారనివ్వకుండా వెంటాడుతుంటాయి. మరి కొన్ని మీ అభివృద్ధికి ఆటంకంగా మారవచ్చు. అలాంటి వాటిలో ఓవర్ థింకింగ్ ఒకటి. ప్రస్తుతం ఈ అతి ఆలోచనా ధోరణే చాలా మంది యువతీ యువకులకు మనశ్శాంతి లేకుండా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. చదువు, ఉద్యోగం, జీవితం, రోజువారీ కార్యకలాపాలు ఇలా ప్రతీ విషయంలోనూ మంచీ చెడూ, పాజిటివ్, నెగెటివ్ ఉంటాయి. ఈ క్రమంలో నెగెటివ్‌ను ఎక్కువగా స్వీకరించడం, ఆలోచించడం వల్ల కలిగే ప్రతికూల ధోరణుల్లో ఓవర్ థింకింగ్ కూడా ఒకటి. ఇది మీలో నిరాశా నిస్పృహ, ఆందోళన, ఒత్తిడికి కారణం అవుతుంది. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సక్సెస్ సాధించడానికి ఆటంకంగా మారుతుంది. కొత్త సంవత్సరంలో మీరు ఇలాంటి అడ్డంకులేవీ ఉండకూడదనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఏంటంటే... ఓవర్ థింకింగ్ వదిలేయండి.

స్వీయ సంరక్షణ ముఖ్యం

లైఫ్‌లో సంతోషంగా ఉండాలంటే సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యం. అయితే ఉరుకులూ పరుగుల జీవితంలో కొందరు దీనిపై శ్రద్ధ చూపరు. సమయానికి తినకపోవడం, నిద్రను త్యాగం చేయడం, అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా తర్వాత చూద్దాం లే అనుకొని కేర్ తీసుకోకపోవడం వంటి నిర్లక్ష్యాలు అలా జరిగిపోతూనే ఉంటాయి. కానీ అవే తర్వాత సమస్యలుగా మారుతాయని గుర్తుంచుకోండి. అందుకే ఎంత బిజీగా ఉన్నా.. సమయానికి తిండి, సరైన నిద్ర, మెరుగైన ఆరోగ్యం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇవి మీలో ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి.

Read More...

New Year : న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్.. మన దేశంలో ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామో తెలుసా?






వర్తమానంలో జీవిద్దాం

ప్రతి ఒక్కరికీ గత అనుభవాలు ఉంటాయి. అవి మీలో ఆనందాన్ని కలిగించేవిగానో, బాధన మిగిల్చినవిగానో ఉండవచ్చు. అయితే వాటిచుట్టే మీ ఆలోచనలు తిరుగుతుంటే భవిష్యత్‌లో మార్పు సాధ్యం కాదు. కాబట్టి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ఈ తరుణంలో గత విషాదాలను, అనుభవాలను జ్ఞాపకాల డైరీలో భద్ర పరచండి. ఎందుకంటే మీరు వర్తమానంలో ఎదగాలంటే వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయవద్దు అంటున్నారు నిపుణులు. పైగా అలా చేస్తే సమయం వృథా అవుతుంది. అంతేకాకుండా గత పొరపాట్లకు చింతిస్తూ కూర్చోవడం, మధురమైన పాతరోజుల కోసం ఆరాట పడుతూ బాధపడటం, వర్తమానాన్ని పట్టించుకోవడం మీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. కాబట్టి గతాన్ని ఒక జ్ఞాపకంగా ఉండనివ్వండి. వర్తమానంలో జీవించండి. అప్పుడే మీరు దృఢంగా తయారవుతారు. సంతోషంగా ఉంటారు.

సవాళ్లను స్వీకరించండి

జీవితం ఎల్లప్పుడూ కంఫర్ట్‌గానే ఉండాలని భావిస్తుంటారు చాలా మంది. కానీ అది ఎవరికీ సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో, ఏదో విషయంలో సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. కొందరు వీటికి భయపడి అవకాశాలను కోల్పోతుంటారు. లక్ష్యాలను విస్మరిస్తుంటారు. ఇంకొందరైతే సవాళ్లను స్వీకరించకముందే భయంతో వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వృత్తిపరమైన, చదువుపరమైన సవాళ్లను అలా నిరోధించడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. వాటిని స్వీకరిస్తేనే మీలో ధైర్యం, ఆత్మ స్థైర్యం పెరుగుతాయి. కాబట్టి వదిలేయాల్సింది సమస్యలనో, సవాళ్లనో కాదు, వాటిని స్వీకరించలేని, ఎదుర్కోలేని భయాన్ని వదిలేయండి.

సామాజిక సంబంధాలు ముఖ్యం

మనకు చాలా తెలిసి ఉండవచ్చు. కానీ అన్నీ తెలుసు అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఎందుకంటే.. ఏ వ్యక్తి కూడా సర్వస్వం తెలిసిన వారిగా ఉండటం సాధ్యం కాదు. అనుభవాలు, అవగాహన, ప్రవర్తన, సమస్యలు, సవాళ్లు, ఆటంకాలు ఇలా రకరకాల సందర్భాల్లో నేర్చుకుంటూ ముందుకు సాగాల్సిందే. అయితే ఇలాంటి మానసిక బలం, ధైర్యం, ఆత్మ స్థైర్యం వంటివి ఒంటరిగా వృద్ధి చెందేవి కావు. సామాజిక సంబంధాలతో, అధ్యయనాలతో, పరీశీలనతో డెవలప్ అవుతాయి. కాబట్టి మీరు సామాజిక సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. 2025లో మీరు సక్సెస్ ఫుల్ పర్సన్ కావాలంటే సమగ్ర అధ్యయనం, సామాజిక పరిశీలన, సోషల్ కనెక్షన్స్ ముఖ్యమని గుర్తించండి.

పగ, ప్రతీకారం, జెలసీ

జీవితంలో మీకు నష్టం చేసే విషయాల్లో పగ, ప్రతీకారం, జెలసీ వంటివి కూడా ఉన్నాయి. నిజానికి ఇవి ఇతరులను నష్టపరిచేందుకు కొందరు ఉపయోగించుకునే చెడు అలవాట్లు లేదా ప్రవర్తనగా నిపుణులు పేర్కొంటారు. అంతేకాదు వీటిని కలిగి ఉన్నవారు ఇతరులకు జరిగే నష్టంకంటే, తాము పొందే స్వీయ నష్టం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నచ్చని విషయాలను మనసులో పెట్టుకోవడం, నచ్చని వారికి నష్టం చేయడమే లక్ష్యంగా నడుచుకునే క్రమంలో తమ పని, తమ అభివృద్ధి, తమ కుటుంబం వంటి విషయాలపై తక్కువ ఫోకస్ చేస్తారు. చివరికి స్వీయ అపరాధ భావనకు గురౌతారు. పైగా పగ, ప్రతీకారం, జెలసీ వంటివి పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతిబింబం కావు. పిరికి మనస్తత్వానికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి కొత్త సంవత్సరంలో మీరు వదిలేయాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు పగ, ప్రతీకారం, జెలసీ కూడా అనేది గుర్తుంచుకోండి.

మార్పు పట్ల భయం వద్దు

చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. మార్పును వెంటనే స్వీకరించరు. ఎందుకంటే సహజంగానే మనంరొటీన్‌‌కు అలవాటు పడిపోతుంటాం. అందుకే మార్పు అంటే వెంటనే రుచించదు. దానివల్ల కలిగే సానుకూల అంశాలకంటే.. ప్రతికూలతలే ఎక్కువగా వెతుకుతుంటాం. అయితే మార్పు అనేది మీకు నష్టం చేసేది అయినప్పుడు మారాల్సిన అవసరం లేదు. కానీ మీ జీవితానికి మేలు చేసేదైతే ఎందుకు ఆహ్వానించకూడదు అంటున్నారు నిపుణులు. కాలంతోపాటు మీరు మారనంత వరకు సమస్యల సుడిగుండంలో పడి కొట్టు మిట్టాడుతూనే ఉంటారు. అందుకే మార్పును గుడ్డిగా వ్యతిరేకించకండి. మీరు దృఢత్వమైన మనస్తత్వం గల మనుషులుగా తయారు కావాలంటే మంచి కోసం మారే అవకాశాలను చేజార్చుకోవద్దు. 2025లో కూడా అలా ఉండాలని గట్టిగా డిసైడ్ అయిపోండిక.

Advertisement

Next Story

Most Viewed