సీఎం రేవంత్‌రెడ్డి ట్రీట్‌మెంట్‌.. నేల మీదకి వచ్చిన స్టార్స్

by srinivas |
సీఎం రేవంత్‌రెడ్డి ట్రీట్‌మెంట్‌.. నేల మీదకి వచ్చిన స్టార్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటివరకు సమాజం, చట్టాలకు తాము అతీతులమనే తీరుగా వ్యవహరించిన సినిమా రంగానికి చెందిన ప్రముఖులు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో దారికొచ్చినట్టు చర్చ జరుగుతున్నది. చెరువులో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చడం, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో రేవంత్ మొహమాటానికి వెళ్లలేదు. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఫ్రీడం ఇచ్చారు. దీనితో ఇంతకాలం ఆకాశంలో విహరించిన సినిమా స్టార్స్ చివరికి నేల మీదికి వచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.

సామాజిక బాధ్యత లేని టాలీవుడ్

సామాజిక బాధ్యతల విషయంలో మిగతా భాషలకు చెందిన సినిమా ప్రముఖులతో పోల్చితే టాలీవుడ్‌కు చాలా తక్కువనే విమర్శలు ఉన్నాయి. ఇతరుల నుంచి ఆశించడమే తప్పా సహాయం చేయాలనే స్పృహ ఉండదనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అందుకు కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనైన, విభజన తర్వాతనైన తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు బాధితులను ఆదుకునేందుకు సినిమా రంగం నుంచి స్పందన అంతంతమాత్రమేననే విమర్శలు ఉన్నాయి. అదే ఉత్తరాది సినిమా ప్రముఖులు కాని తమిళ, కేరళ నటీనటులు తమ రాష్ట్రాల్లో ప్రకృతి బీభత్సం సృష్టించినప్పుడు బాధితులను అక్కున చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తుంటారు.

తాజాగా ఖమ్మం, ఏపీలోని కృష్ణా జిల్లాలో వచ్చిన వరదల సమయంలో బాధితులను ఆదుకునేందుకు ఆశించనిస్థాయిలో ముందుకు రాలేదనే విమర్శలున్నాయి. తాము ఉంటోన్న ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ అవసరాలు పక్కాగా ఉండాలని డిమాండ్ చేసే సినిమా ప్రముఖులు పోలింగ్ జరిగే రోజు ఓటు వేయకుండా, ఇంట్లోనే ఎంజాయ్ చేస్తుంటారనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.

తెలుగు హీరోలకంటే సోనుసూద్ మేలు

బాలీవుడ్ నటుడు సోనుసూద్ కంటే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరోలు టాలీవుడ్‌లో ఉన్నారు. కానీ ఆయనకు ఉన్న సామాజిక బాధ్యత టాలీవుడ్ హీరోలకు లేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు బాధితులు తమకు సాయం కావాలని సోషల్ మీడియా వేదికగా ఆయనకు అప్పీలు చేయగానే ఆయన వెంటనే స్పందించి, ఆదుకున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కానీ టాలీవుడ్ హీరోలు మాత్రం తమకేం సంబంధం అనే తీరుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చట్టం ముందు అందరూ సమానులే

చట్టం ముందు అందరూ సమానమనే విషయాన్ని సినీ ప్రముఖులకు ఆర్థమయ్యే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించారనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. నాగార్జున, అల్లు అర్జున్, మంచు ఫ్యామిలీకి చట్టాన్ని ఉల్లంఘిస్తే యాక్షన్ ఎలా ఉంటుందో చూపించారు. తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేదని, తప్పంతా పోలీసులదే అనే తీరుగా అల్లు అర్జున్ చెప్పడం, అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు తమదైన శైలిలో అటాక్ చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చి కేసు గురించి ఎలా మాట్లాడుతారు? అని విచారించారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుకుని బీఆర్ఎస్ హయాంలో సైతం నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ జోలికి ఎవరూ వెళ్లలేదు. చెరువులోనే ఆ నిర్మాణం ఉందని అందరికీ తెలిసినా పట్టించుకోలేదు. కానీ హైడ్రా యాక్షన్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతోనే స్టార్ట్ అయ్యింది. కూల్చకుండా నాగార్జున ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. మంచు ఫ్యామిలీ గొడవను మోహన్‌బాబు, ఆయన కొడుకులు విష్ణు, మనోజ్ బయట వేసుకుని చట్టాన్ని ఉల్లంఘించడంతో ఆ ముగ్గురికి చెందిన గన్స్ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు.

బెనిఫిట్ షో, టికెట్ల ధరల పెంపు కోసం చివరి ప్రయత్నం

మొన్నటివరకు ఓ రాజకీయ పార్టీ ప్రోత్సాహంతో ఇష్టం ఉన్నట్లు వ్యవహరించిన సినిమా ప్రముఖులు పోలీస్ టవర్స్‌లో జరిగిన మీటింగ్ సమయంలో రేవంత్‌ను‌ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తున్నది. తమకు సర్కారు నుంచి సహకారం కావాలని వేడుకున్నట్టు సమాచారం. సంక్రాంతి సందర్భంగా కొన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటికి బెనిఫిట్ షోలు, టికెట్స్ ధరల పెంపుకోసం అవకాశం ఇవ్వాలని ప్రపోజల్‌ను తెరమీదికి తెచ్చినట్టు టాక్. సీఎం రేవంత్ మాత్రం ఇప్పటికే వాటిపై ప్రభుత్వ విధానం ఏంటో ప్రకటించామని, ఇంకా ఆ విషయాన్ని ప్రస్తావించొద్దని చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే, చివరి ప్రయత్నంగా బెనిఫిట్ షో, టికెట్ల ధరల పెంపు విషయాలను మరోసారి ప్రభుత్వంతో చర్చించాలని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజ్‌కు పెద్ద నటులు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story