సిండికేట్ సొమ్ముతో రియల్ వ్యాపారం..

by Aamani |
సిండికేట్ సొమ్ముతో రియల్ వ్యాపారం..
X

దిశ, హుజూరాబాద్ : హుజూరాబాద్ సిండికేట్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. టోకెన్ పేరుతో బెల్ట్ షాపుల యజమానుల ద్వారా వసూలు చేసిన సొమ్ము రూ.లక్షల్లో కూడగట్టి సదరు డబ్బుతో బయట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. సిండికేట్ నుంచి బెల్ట్ షాపులకు మందు ఇవ్వాలంటే ఆ షాపుల యజమానుల నుంచి టోకెన్ పేరుతో డిపాజిట్ తీసుకుంటారు. ఆ సొమ్ముతో ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. హుజూరాబాద్ సిండికేట్‌లో ప్రధాన వ్యక్తులు ఈ డబ్బును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి లాభాలు గడుస్తూ షాపులు అయిపోయాక టోకెన్ డబ్బులు పెట్టిన వారికి అసలు ముట్టచెప్పడం తో మద్యం వ్యాపారులకు వడ్డీ లేకుండా పెట్టుబడి వచ్చినట్లు అవుతుంది.

పేదల సొమ్ము పెద్దోళ్ల పాలు..

సిండికేట్ పేరుతో వసూలు చేసే టోకెన్ డబ్బులు గ్రామాల వారీగా బెల్ట్ షాప్ యాజమానుల నుంచి గ్రామాలు, షాపుల పరిస్థితిని బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆ డబ్బులు డిపాజిట్ చేస్తేనే బెల్టుషాపులు మద్యం ఇస్తారు. లేకపోతే వారిని ఆ దరిదాపులకు సైతం రానివ్వరు. ఒకవేళ కర్మ గాలి సిండికేట్ ప్రైవేట్ సైన్యం తనిఖీ చేసినప్పుడు సిండికేట్ ముద్ర లేకుండా వేరే మందు దొరికితే వారు డిపాజిట్‌గా కట్టిన మొత్తం డబ్బులు జప్తు చేశారు. మళ్లీ మద్యం కావాలంటే మళ్లీ డిపాజిట్ చేయాలి. ఇక ముందు వేరే షాపుల నుంచి మద్యం తీసుకోమని అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. ఇదే ఇక్కడ జరుగుతున్న పెదరాయుడు తీర్పు.

అన్ని పార్టీలు వీరికే వత్తాసు...

ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వీరికే వత్తాసు పలుకుతుండడంతో గమనార్హం. ఎందుకంటే వీరికి అన్ని పార్టీలను మేనేజ్ చేసుకునే అనుభవం, చతురత వీరి సొంతం. రాజకీయ రణక్షేత్రంలో వైరి పక్షాలుగా ఉన్నా ఇక్కడ మాత్రం వీరు సౌఖ్యంగా ఉంటారు. సాయంత్రం సిండికేట్ అనే చెట్టు కింద సేద తీరుతున్నారు. హుజూరాబాద్ మండలంలో 100 బెల్ట్ షాపులకు ఉన్న టోకెన్ డబ్బులు చిన్నా, చితక, పెద్ద షాపులతో కలిసి దాదాపుగా రూ.2కోట్ల వరకు జమ అవుతుంది. ఈ డబ్బుతో వీరు దర్జాగా రియల్ ఎస్టేట్‌తోపాటుగా ఈ మధ్య కొత్త వ్యాపారాల్లో జాయిన్ అయినట్టు సమాచారం.

అధికారుల మౌనం.. ఆంతర్యమెంటో..?

సిండికేట్ పేరుతో ఇంత విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. గ్రామాల్లో ఎవరిని అడిగినా మందు ఎంత ఎక్కువ రేటుకు అమ్ముతున్నారన్న విషయం అర్థం అవుతుంది. బెల్ట్ షాపులకు మందు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఫిర్యాదు చేయడానికి సైతం ప్రజలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఫిర్యాదులు సైతం చేశారు. అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఒకవైపు అక్రమ సిట్టింగ్, మరో వైపు అక్రమ బెల్టు షాపులు నిర్వహిస్తూ ఒక నియంత పాలన సాగిస్తున్నారు. అయినా ఇక్కడ చలనం లేదు. దీనికి విరుగుడుగా ప్రజా సంఘాలు కదలాలి, పోరాటం చేయాలి అపుడే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సిండికేట్ లెక్కల్లో తేడాలు..?

ఈ మధ్య కాలంలో సిండికేట్‌లో తేడాలు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా ఇందులో ఉన్న షాపుల యజమానులు కిమ్మనకుండా ఉంటున్నారు. ఏమైనా అంటే వారిపై అధికారులతో కేసులు చేయించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే పెద్ద పెద్ద షాపులు ఉన్న వారు సైతం కిమ్మనకుండా ఉంటున్నారని చెబుతున్నారు. తేడాల్లో ఉన్న లెక్కలు అడిగితే వారి పని అధోగతేనని పలువురు తెలుపుతున్నారు. కాగా, అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story