Asma : బషర్‌ అల్‌ అసద్‌ సతీమణికి ప్రాణాంతక క్యాన్సర్‌

by Hajipasha |
Asma : బషర్‌ అల్‌ అసద్‌ సతీమణికి ప్రాణాంతక క్యాన్సర్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌(Bashar Al Assad) సతీమణి అస్మా(Asma) లుకేమియా(Leukemia) అనే ప్రాణాంతక క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని సమాచారం. అస్మాకు క్యాన్సర్ నిర్ధారణ అయిందని ఈ ఏడాది మే నెలలోనే సిరియా అధ్యక్ష కార్యాలయం ప్రకటన చేసిందని అంటున్నారు. లుకేమియా నుంచి అస్మా కోలుకునే అవకాశాలు 50-50 ఉన్నాయని చెబుతున్నారు.

సిరియాకు చెందిన దంపతులకు 1975లో బ్రిటన్‌లో అస్మా జన్మించారు. ఆమెకు సిరియా పౌరసత్వంతో పాటు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. 2000 సంవత్సరం డిసెంబరులో బషర్ అల్ అసద్‌ను అస్మా పెళ్లి చేసుకున్నారు. అసద్, అస్మా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు.. హఫీజ్, జైన్, కరీం. 2019లో అస్మా రొమ్ము క్యాన్సర్‌ను జయించారు. ఏడాది పాటు చికిత్స తీసుకుని దాని నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆమె బ్లడ్‌ క్యాన్సర్ బారినపడ్డారు. భర్త బషర్ అల్ అసద్ నుంచి విడాకుల కోసం మాస్కోలోని ఓ కోర్టులో అస్మా పిటిషన్ వేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని అస్మా కానీ, రష్యా ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు. మొత్తం మీద ప్రస్తుతం అసద్ దంపతులు ప్రస్తుతం మాస్కో నగరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story