Shankarpalli Market: ఆదాయం అంతంతే.. టార్గెట్ సైతం సాధించని వైనం

by Ramesh Goud |
Shankarpalli Market: ఆదాయం అంతంతే.. టార్గెట్ సైతం సాధించని వైనం
X

దిశ, శంకర్ పల్లి : మార్కెట్ కమిటీలు రోజురోజుకూ నామమాత్రంగా తయారవుతున్నాయి. ఆర్థిక సంవత్సరానికి గాను సాధించాల్సిన టార్గెట్లు కూడా సాధించకపోగా వచ్చినంతనే చాలు అన్నట్లు సిబ్బంది వ్యవహారం కొనసాగుతున్నది. అధికారుల తనిఖీలు అసలే లేకపోవడం సిబ్బంది కొరత కూడా వేధిస్తుండడంతో ఆదాయం పెంచుకోవడంలో అధికారుల చిత్తశుద్ధి లోపిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ 2022- 23 సంవత్సరంలో టార్గెట్ రూ.49.39 లక్షలు ఉండగా.. రూ. 50.45 లక్షలు వసూలైంది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ రూ.56.11 లక్షలు ఉండగా.. కేవలం రూ.28.01 లక్షలు వసూలు చేసి సగానికి సగం పడిపోయింది. రెండు సంవత్సరాల క్రితం పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ఆదాయం బాగానే వచ్చింది. పత్తి ద్వారానే రూ.18.51 లక్షల ఆదాయం రాగా, గత సంవత్సరం కేవలం చెక్ పోస్ట్ ద్వారా ( పత్తి ) రూ. 1.63 లక్షలకే పరిమితమైంది. రెండు సంవత్సరాల క్రితం పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడం రైతులు ప్రైవేట్ గా అమ్ముకోవడంతో మార్కెట్కు భారీగా ఆదాయం వచ్చింది. గత సంవత్సరం చేవెళ్లలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో శంకర్పల్లి మార్కెట్ కమిటీకి ఆదాయం తగ్గిపోయింది.

ఫామ్ హౌస్ లు, రిసార్టులు పెరిగిపోవడంతో తగ్గిన సాగు విస్తీర్ణం

రోజురోజుకు పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో ఆ ప్రభావం మార్కెట్ కమిటీ ఆదాయంపై కూడా పడుతుంది. గతంలో శంకర్ పల్లి, నవాబ్ పేట్, మోమిన్ పేట్, మండలాలతో పాటు మెదక్ జిల్లా కొండాపూర్, సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలలో రైతులు ఉల్లిగడ్డతో పాటు కూరగాయలు, పూల తోటలు అధికంగా సాగు చేసేవారు. శంకర్ పల్లి మార్కెట్ గతంలో ఉల్లిగడ్డల క్రయవిక్రయానికి పేరు ప్రసిద్ధిగాంచింది. కానీ రాను రాను సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉల్లిగడ్డల సీజన్ క్రయవిక్రయాలు కూడా నామమాత్రంగా తయారు కావడంతో ఆదాయం పడిపోవడానికి కారణం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు కూరగాయల సాగు విస్తీర్ణం కూడా తగ్గడం నవాబ్ పేట్ మోమిన్ పేట్, శంకర్ పల్లి, మండలాలలోని పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపా రం, వెంచర్ల ఏర్పాటు జరుగుతుండడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. అరకొర కూరగాయలు సాగు చేసిన రైతులు శంకర్పల్లి మార్కెట్ తో పాటు పటాన్ చేరువు తో పాటు నగరంలో విక్రయిస్తున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో మార్కెట్లో కూరగాయల రేట్లు కూడా బగ్గుమంటున్నాయి. 2022- 23 సంవత్సరంలో కూరగాయల విక్రయాల ద్వారా రూ.0.84 లక్షల ఆదాయం రాగా 2023- 24 సంవత్సరంలో రూ.0.87 లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం నవంబర్ వరకు కూరగాయల ద్వారా కేవలం రూ.0.69 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

2024 -25 సంవత్సరం టార్గెట్ రూ. 47.12 లక్షలు

2024- 25 సంవత్సరానికి గాను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు మార్కెట్ కమిటీ ద్వారా రూ. 47.12 లక్షల ఆదాయం టార్గెట్ విధించగా నవంబర్ 30 వరకు రూ. 19.19 లక్షల ఆదాయం వసూలైంది. ఎనిమిది నెలల కాలం గడిచినప్పటికీ కనీసం 50 శాతం కూడా మార్కెట్ కమిటీకి ఆదాయం సమకూరలేదు. ఇంకా కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. లక్షలు వెచ్చిం చి గోదాములు నిర్మించిన అవి నేడు నిరుపయోగంగానే ఉన్నాయి. అద్దె ద్వారా ఆదాయం సమకూరాల్సి ఉండగా నిర్మించినప్పటికీ అవి వృథాగానే ఉన్నాయి. శంకర్ పల్లి మార్కెట్ రూ. 3 కోట్ల 11 లక్షలు బకాయి శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన భవన నిర్మాణానికి, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఇతర నిర్మాణాలకు గాను రూ 3.11 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.

పాలకవర్గాల ద్వారా మార్కెట్‌కు కలగని ప్రయోజనం..

వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల ద్వారా మార్కెట్‌కు ఎలాంటి మేలు కలుగకపోగా మార్కెట్ పై పెనుభారం పడుతుంది. పాలకవర్గం చైర్మన్ వేతనం, సమావేశాలు నిర్వహించినప్పుడల్లా సభ్యుల ప్రయాణభత్యపు ఖర్చులు భారమవుతుంది. దీనికి తోడు రైతు విజ్ఞాన యాత్ర పేరుతో పాలకవర్గం సభ్యుల విహారయాత్ర ఖర్చు కూడా మార్కెట్ పై భారం పడుతుంది. ఇది కేవలం రాజకీయ పార్టీ నాయకులకు ఉపాధిలా మారుతుంది. మార్కెట్ లోటు బడ్జెట్ తో మూడు కోట్ల అప్పుల్లో కూరుకుపోయినప్పటికీ విహారయాత్రలకోసం ఖర్చు చేయడం అవసరమా.

పశువుల సంత ద్వారా రూ. 7.47 లక్షల ఆదాయం..

శంకర్ పల్లి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుత సంవత్సరం ఎనిమిది నెలల్లో ( నవంబర్ నెల వరకు) రూ. 7.47 లక్షలు రాగా 2022- 23 సంవత్సరంలో పశువుల సంత( మేకలు, ఆవులు గేదెలు ఎద్దులు కలిపి) ద్వారా రూ. 10.72 లక్షలు రాగా.. 2023 24 సంవత్సరంలో రూ. 11.28 లక్షలు వసూలు చేశారు. పశువుల సంత బుధవారం కొనసాగుతుండడం, కూరగాయల క్రయవిక్రయాలు మంగళవారం, గురువారం, శనివారం, ఉల్లిగడ్డల క్రయవిక్రయాలు సీజన్లో ఆది వారం, బుధవారం కొనసాగుతాయి.

ఆదాయం పెంపునకు కృషి..

శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి గతంలో మంచి ఆదాయం వచ్చేది. గత కొన్నేళ్లుగా పంటల సాగు తగ్గిపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం, చెక్ పోస్ట్ ఆదాయం కూడా తగ్గడం తదితర కారణాలతో ఆదాయం ఆశించినంతగా రావడం లేదు. ఉల్లిగడ్డ కూడా ఆశించినంతగా రావడం లేదు. పశువుల సంత, కూరగాయల సంత ఇతరత్రా వాటి ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తా. మార్కెట్ కమిటీ ఆధ్వర్యం లో నిర్మించిన గోదాములు నాలుగు సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాయి. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించాం. దాని ద్వారా మార్కెట్ కు కొంత ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ కమిటీ కార్యదర్శి ఐశ్వర్య లక్ష్మి తెలిపారు.

Next Story

Most Viewed